JMS News Today

For Complete News

కదంతొక్కిన కలం కార్మికులు…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, అక్టోబర్ 14: కలం కార్మికులు కదంతొక్కారు. జజ్జనకరే జనారే అంటూ డప్పు కళాకారులతో కలిసి దరువేశారు. నినాదాలతో హోరెత్తించారు. జర్నలిస్టుల సమస్యల సాధన కోసం టీయూడబ్ల్యూజే (ఐజెయు) ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ పేరిట నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జర్నలిస్టులు ప్లకార్డులు చేతబూని కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ నినాదాలతో కలెక్టరేట్ పరిసరాలు మారుమోగాయి. ఈ ధర్నా కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీ, కార్మిక సంఘాల నేతలు హజరై మద్దతు ప్రకటించి, ప్రసంగించారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జర్నలిస్టు సంఘం నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం విషయంలో కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు సైతం అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. ఆ హామీల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఆందోళనలు చేపట్టాల్సి వచ్చిందని, ఇప్పటికే మండల, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టి, ఈరోజు జిల్లా కలెక్టరేట్ ల ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడకపోతే, రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు, జీవో 239 ని రద్దు చేసి, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, హెల్త్ కార్డులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని శేఖర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్, జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జానంపేట మారుతీ స్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్మూరి విజయసింహా రావు, ఈద మధుకర్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు ఎలగందుల రవీందర్, నాయకులు నర్సింగోజు మహేంద్ర చారి, విజయ భాస్కర్, ఎండి షుకూర్, అసద్, మోసిన్, రమేష్, డి.జగన్ మోహన్, సందీప్, ప్రేమ్ కుమార్, దాడి సంపత్, రాజయ్య, శ్రీనివాస్ రెడ్డి, రవీంద్ర చారి, గంగరాజం, కె.సత్యనారాయణ, ఇమామ్, మొయిజోద్దీన్, నిజాముద్దీన్, శ్రీనివాస్, రఫీ, మధు, వివిధ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లాలోని అన్ని మండలాల రిపోర్టర్లు, జిల్లా కేంద్రంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *