JMS News Today

For Complete News

జర్నలిస్టుల ఒకరోజు నిరసన దీక్ష సక్సెస్

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, అక్టోబర్ 4: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం (ఐజెయు) కమిటీ పిలుపు మేరకు రెండో దఫా ఆందోళనలో భాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిర్వహించిన జర్నలిస్టులు ఒకరోజు నిరసన దీక్షలు విజయవంతమయ్యాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జర్నలిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ దీక్ష శిబిరాలను పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించి ప్రసంగించారు. కరీంనగర్ లో జరిగిన దీక్ష శిబిరాన్ని సందర్శించి దీక్షను బిజెపి జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు ప్రారంభించి ప్రసంగించారు. అలాగే సీపీఐ జిల్లా కార్యదర్శి కేదారి, టీఎన్జీయు జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘుశంకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, ఎస్జీటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరివెద మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్, టిడిపి నేతలు దామెర సత్యం, కళ్యాడపు ఆగయ్య, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తిరుపతి, ఎఐటీయుసీ జిల్లా అధ్యక్షుడు బుచ్చన్న యాదవ్ లతో పాటు పలువురు ప్రసంగిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన టీయుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి గతంలో అనేక వేదికలపై హామీలు ఇచ్చి ఎన్నికల ప్రణాళికలో ప్రత్యేకంగా పేర్కొని వాటిని అమలు చేయడంలో జాప్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళన బాట తప్పలేదని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా తొలి దశలో మండల రెవెన్యూ కార్యాలయాల ముందు ఇప్పటికే ఆందోళన చేపట్టిన జర్నలిస్టులు రెండవ దశలో భాగంగా రెవిన్యూ డివిజన్ కార్యాలయాల ముందు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం కళ్లు తెరిచి జర్నలిస్టు సంక్షేమ పథకాల అమలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు జారీ చేస్తూ కార్పొరేట్ వైద్య సంస్థల్లో జర్నలిస్ట్ బీమా అమలు జరిగే విధంగా చూడాలని, అదే విధంగా గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జర్నలిస్టులకు నివేశన స్థలాలు కేటాయిస్తూ అందులో గృహాలు నిర్మించి ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఈ సమస్యల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని కరుణాకర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జానంపేట మారుతీ స్వామి, రాష్ట్ర, జాతీయ నాయకులు బల్మూరి విజయసింహారావు, ఈద మధుకర్ రెడ్డి, ఎలగందుల రవీందర్, జిల్లా నాయకులు గజవాడ ఆంజనేయులు, విజయ భాస్కర్, నర్సింగోజు మహేంద్ర చారి, జగన్, రవీంద్ర చారి, మోసిన్, ఇమామ్, నిజాాముద్దీన్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, వివిధ మండలాల జర్నలిస్టులు, వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చలిమెడ లక్ష్మినరసింహరావు నిమ్మ రసం అందించి దీక్షను విరమింపజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *