తప్పదు మారాలి..అప్పటివరకూ అంతే…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, నవంబర్ 25: తప్పుడు నెంబర్లు వేసుకోవడం, అదేకాక ఒకరి నెంబర్ మరోకరు వేసుకోవడం, నెంబర్లు కనపడకుండా స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్న వాహనదారులకు నగర పోలీసులు వణుకు పుట్టిస్తున్నారు.
కరీంనగర్ నగరంలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా గురువారం కూడా కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో సుమారు అరవై వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు 150 వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నారు. వీటిలో కొంత మంది నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేయగా, మరి కొంతమంది వేరొక వాహనం నంబర్లను తమ వాహనం నంబర్ ప్లేట్ పై వేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని నగర ఏసీపీ శ్రీనివాస రావు హెచ్చరించారు. అంతేకాకుండా వాహనదారులలో పరివర్తన వచ్చి ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేంతవరకు ఈ వాహన తనిఖీల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని ఏసీపీ స్పష్టం చేశారు.