ఎంపీ సంజయ్ ఏమన్నారంటే…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 14: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నగర ప్రజలు అందరూ బిజెపి వైపు చూస్తున్నారని, వారి ఆశయాలకనుగుణంగా ప్రతి కార్యకర్త కష్టించి పనిచేయాలని, గడపగడపకు వెళ్లి బిజెపి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో జరిగిన బిజెపి నగర కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కరీంనగరం స్మార్ట్ సిటీగా రూపు దిద్దుకోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు. డివిజన్లలో తిరుగుతూ ప్రజల ఆశీర్వాదం పొందుతూ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే విధంగా కృషి చేయాలని, నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరేయాలని ఆకాంక్షించారు. టికెట్ ఎవరికీ వచ్చినా అందరూ కలిసికట్టుగా గెలుపునకు కృషి చేయాలని కోరారు. టిఆర్ఎస్ నాయకులు చెప్పే దొంగమాటలు, దొంగ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని సంజయ్ ఆకాంక్షించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యంగా కరీంనగర్ ప్రజలు కార్పొరేషన్ లో బిజెపికి పట్టం కట్టాలని చూస్తున్నారని అన్నారు. టిఆర్ఎస్ నాయకుల వైఖరి పట్ల విసుగుచెందిన ప్రజలు బిజెపిలో చేరుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. నగర అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు శివరామకృష్ణయ్య, మురళీకృష్ణ, లోకేష్ శ్రీనివాస్ గౌడ్, రాపర్తి విజయ, మెండి శ్రీలత తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు