JMS News Today

For Complete News

మాస్క్ లు ధరించండి….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఏప్రిల్ 6: రాష్ట్రం, జిల్లాలలో రాబోయే రెండు వారాలలో కోవిడ్-19 (కరోనా వైరస్) ఎక్కువగా విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున జిల్లాలోని ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి ప్రభుత్వ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ముగియడానికి రోజులు దగ్గర పడుతున్నందున, రాబోవు రోజులలో వైరస్ వ్యాప్తి చాలా తీవ్రంగా మారే ప్రమాదమున్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందని, కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్న వారు మాత్రమే మాస్కులు ధరించాలని సూచించిందని, రాబోవు రోజులలో వైరస్ తీవ్రమమ్యే అవకాశాలు ఉన్నందున ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించుటతో పాటు ఒంటి, ఇంటి, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఇండ్లకే పరిమితం కావాలని కోరారు. కరోనా వైరస్ గాలి ద్వారా రాదని, అది కేవలం, దగ్గు, తుమ్ముల ద్వారా వచ్చే తుంపర్ల ద్వారా ఒకరి నుండి ఒకరికి సోకి వ్యాధికి గురవుతారని, అందువల్ల మాస్కులు ధరించుట ద్వారా ఈ వైరస్ రాకుండా కొంతమేర తగ్గించవచ్చునని పేర్కొన్నారు. అంతేగాక మనిషి మనిషికి భౌతిక దూరాన్ని పాటించడం, ఎక్కువమంది గుంపులు గుంపులుగా గుమికూడకుండా నియంత్రించుట ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని, ముఖ్యంగా కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడు ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. అలాగే జిల్లాలో డీఆర్డీఏ, మెప్మా, స్వయం సహాయక సంఘాలు, ఐటిఐలలో మాస్కులు తయారు చేస్తున్నారని వాటిని తక్కువ ధరలకు విక్రయించుటకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఒకవేళ ఎవరైనా బయటకు వెళ్లలేని పక్షంలో మీ ఇండ్లలో ఉండే కాటన్ క్లాత్ ని మాస్కులుగా తయారుచేసుకొని ధరించాలని సూచించారు. అలాగే వైద్య సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కొరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించిందని, అందుకు అనుగుణంగానే వారు వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో వారు వినియోగించుకొనుటకు యన్-95 మాస్కులు, కిట్లు, పి.పి.ఈ.లు, చేతులకు ధరించుటకు గ్లౌజులు అందుబాటులో ఉంచామని తెలిపారు ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే విషయంలో వైద్యాధికారులు, సిబ్బంది వారి కుటుంబ బాధ్యతలు మరిచి వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండ వ్యాధి సోకిన వారికి వైద్యులు అందిస్తున్న సేవలు మరువలేనివని, అలాంటి డాక్టర్లు, వైద్య సిబ్బందిని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. కాబట్టి డాక్టర్లు, వైద్య సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించుట ద్వారా కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నివారించవచ్చని పేర్కొన్నారు. అంతేగాక జిల్లా ప్రజలు ఎంతో సమయ స్పూర్తితో ప్రభుత్వం విధించిన నివంధనలు కొంత కష్టంగా ఉన్నప్పటికి ఎంతో ఇష్టంతో వారు లాక్ డౌన్, కర్ఫ్యూ సందర్భాలలో జిల్లా యంత్రాంగం సూచించే సూచనలు, సలహాలు పాటిస్తూ ఇప్పటివరకు సహకరించిన వారికి మరోమారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇదే స్పూర్తితో మరో రెండు వారాలు మాస్కులు ధరించి స్వీయ నియంత్రణ పాటిస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తూ ఇండ్లకే పరిమితం కావాలని కలెక్టర్ ఆ ప్రకటన లో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *