కరీంనగర్ పోలీసుల ఔదార్యం…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, అక్టోబర్ 27: ఇటీవల కరీంనగర్ లోని ఆటోనగర్ లో దారుణ హత్యకు గురైన ట్రాక్టర్ డ్రైవర్ ఇరుకుల్ల నరసయ్య (42) కుటుంబానికి కరీంనగర్ పోలీసులు చేయూతగా నిలిచి ఔదార్యాన్ని చాటుకున్నారు. పోలీసు శాఖ తరపున, శాంతి సంక్షేమ కమిటి సభ్యుల సహకారంతో విరాళాలుగా సమకూర్చిన లక్షా 50వేల రూపాయల మొత్తానికి సంబంధించిన ధృవపత్రాలు, నెల రోజులకు సరిపడా క్వింటాల్ బియ్యం, 15 కిలోల వంట నూనె, నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను శనివారం పోలీసు కమీషనర్ కమలాసన్ రెడ్డి తిమ్మాపూర్ మండలం జూగండ్లలోని నర్సయ్య ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులకు అందజేశారు. ముగ్గురు పిల్లల విద్యాభ్యాసం కోసం వివిధ ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చేర్పించనున్నామని, ఇందుకు సంబంధించిన చర్యలను వెంటనే చేపట్టాలని సీపీ పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే నర్సయ్య భార్య విజయకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగ అవకాశాన్ని కల్పించేందుకు కలెక్టర్ ప్రతిపాదనలు పంపనున్నామని తెలిపారు. డబుల్ బెడ్ రూం మంజూరయ్యే విధంగా స్థానిక శాసనసభ్యులు, జిల్లా మంత్రిని కోరుతూ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపించాలని గ్రామ సర్పంచ్ సాయిళ్ళ ఎల్లయ్యను కోరారు. నర్సయ్య హత్య దురదృష్టకరమని సీపీ పేర్కొన్నారు. నర్సయ్యను హత్య చేసిన వారిని అరెస్టు చేశామని, వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని సీపీ కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపిలు ఎస్ శ్రీనివాస్, జి చంద్రమోహన్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, ఎల్ఎండి ఎస్ఐ కృష్ణారెడ్డి, శాంతి, సంక్షేమ కమిటి సభ్యులు గఫార్, ఎంఏ రఫీక్, గ్రామ సర్పంచ్ సాయిళ్ళ ఎల్లయ్య, మాజీ సర్పంచు సాయిళ్ళ రేణుక, రాజ లింగయ్య, వార్డు సభ్యులు జల్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.