ఏలాంటి అనుమతుల్లేవ్…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 17: గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా మండపాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేవని కరీంనగర్ పోలీసు కమిషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొని ఉన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా జరుపుకోవాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లడించిన విషయాలను సీపీ పేర్కొన్నారు. గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా విగ్రహాల ఏర్పాటుకు మండపాలకు అనుమతించబోమని స్పష్టం చేశారు. గణేష్ నవరాత్రోవాలతోపాటు మొహరం వేడుకలకు కూడా కరోనా నియంత్రణ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం , భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న చర్యగా అన్ని వర్గాల ప్రజలు గుర్తించాలని సూచించారు.
నిబంధనలకు విరుద్దంగా అనుమతులు లేకుండా మండపాలను ఏర్పాటు చేసేవారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. మొహార్రం వేడుకలను కూడా నిరాడంబరంగా జరుపుకోవాలని సూచించారు. జన సమూహంతో వైరస్ వ్యాప్తి మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గణేష్ విగ్రహాల తయారీదారులకు కూడా తగు సూచనలు చేశామని తెలిపారు. ప్రార్థనా మందిరాల్లో మూడుఫీట్ల పొడవుకన్నా ఎత్తు విగ్రహాలను ఏర్పాటు చేయకూడదని సూచించారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంతవరకు మట్టి గణపతులను మాత్రమే ఇళ్ళు , ప్రార్థనా మందిరాలలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గణేష్ విగ్రహాలు ప్రతిష్టించిన ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలని, నిమజ్జనం కోసం ఊరేగింపులకు కూడా అనుమతులు లేవని, నిమజ్జనం ప్రాంతాల్లో జిల్లా యంత్రాగం కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయవద్దని నిర్ణయించిందని పేర్కొన్నారు. మొహార్రం సందర్భంగా కూడా ఊరేగింపులకు అనుమతులు ఉండవని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ నిబంధనలపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనరేట్‌లోని పోలీసు అధికారులను ఆదేశించారు. నియమని బంధనలు ఉల్లఘించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాబోవు గణేష్ , మొహార్రంల సందర్భంగా వివిధ మతాల విశ్వాసాలకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టే వారిపై చట్టపరంగా కేసులను నమోదు చేస్తామని తెలిపారు. దుష్పరాచారాలతో వివిధ మతాల మధ్య చిచ్చురేపేందుకు సోషల్ మీడియాలలో పోస్టులు పెట్టేవారిని గుర్తించేందుకు కమిషనరేట్ కేంద్రంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మతవిశ్వాసాలకు భంగం కలిగించేవిధంగా పోస్టుచేయబడే విషయాలను పోలీసుల దృష్టికి తీసుకరావాలని కోరారు. కరీంనగర్ మత సామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు కుల , మత , వర్గ విభేదాలను విడనాడి సోదరభావంతో మెదులుతూ శాంతియుత వాతావరణం నిర్మాణంలో భాగస్వాములవుతున్నారని చెప్పారు.
సోదరభావంతో కలిసిమెలిసి ఉన్న వివిధ వర్గాలకు చెందిన ప్రజల్లో చిచ్చురేపేందుకు ప్రయత్నించే వారు ఆ ప్రయత్నాలు మానుకోవాలని, లేనట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవనే విషయాన్ని గుర్తించాలని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో పోలీసులకు తమవంతు సహకారం అందిస్తున్న కమిషనరేట్‌లోని అన్నివర్గాల ప్రజలకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు.