అనవసరంగా వస్తే…అంతే సంగతులు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఏప్రిల్ 21: ఇక నుండి మరింత పటిష్టంగా లాక్ డౌన్, కఠినంగా కర్ఫ్యూలను అమలు చేస్తామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి వరకు కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో సీపీ ప్రత్యక్షంగా పరిశీలించారు. చెక్ పోస్ట్ లు, పికెట్లను సందర్శించారు. ఈ సందర్భంగా కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మరింత పకడ్బందీగా లాక్ డౌన్, కర్ఫ్యూ అమలు చేస్తామన్నారు. ఎవరైనా తమ నివాసిత ప్రాంతం నుండి మూడు కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే కూరగాయలు, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు నిర్ణీత తరలింపు సమయంలోనే బయటకు రావాలని సూచించారు. పనులు పూర్తి చేసుకున్న వెంటనే ఇళ్లలోకి వెళ్లి స్వీయనిర్బంధాన్ని పాటించాలని చెప్పారు. ఇతర సమయాల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా వాహనాలపై వచ్చే వారికి సంబంధించిన వాహనాలను సీజ్ చేయడంతోపాటు కోర్టుల్లో సదరు వాహనాలను డిపాజిట్ చేస్తామని తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రేయింబవళ్ళు లాక్ డౌన్, కర్ఫ్యూ లను పరిశీలించేందుకు డ్రోన్ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ వాహనం తో పాటు ఇతర ఆధునిక టెక్నాలజీ పరికరాలను వినియోగిస్తామని వివరించారు. కరోనా వైరస్ వ్యాధి నిరోధక చర్యల్లో భాగంగా పోలీసులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనా వ్యాప్తి నిరోధం, ప్రజల రక్షణ భద్రత కోసం రేయింబవళ్ళు అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నా రు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సీయ నిర్బంధాన్ని పాటించడంతో పాటు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్ శ్రీనివాస్, జి చంద్రమోహన్, కరీంనగర్ టౌన్ ఏసిపి అశోక్ వివిధ విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.