కత్తి మీద సామే అయినా….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, డిసెంబర్ 29: శాంతిభద్రతల పరిరక్షణ కత్తి మీద సాము అయినప్పటికీ దానిని ఒక సవాల్‌గా స్వీకరించి కరీంనగర్ పోలీసులు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో టెక్నాలజీ వినియోగంతో నేరాలను కూడా ముందే ఊహించి శాంతిభద్రతల పరిరక్షణకు కూడా అదే స్థాయిలో పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని కరీంనగర్ సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. నేరాలు విజృంభించకుండా పక్కా ప్రణాళికతో అదుపులో ఉంచడంలో కరీంనగర్ పోలీసులు సక్సెస్ అయ్యారని తెలిపారు. బుధవారం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ కమీషనరేట్ శాంతిభద్రతల నివేదిక -2021ను సీపీ వివరించారు. ఈ సందర్బంగా సీపీ అన్ని నేరాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ ప్రజల రక్షణ, భద్రత చర్యలపై భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో కింది స్థాయి అధికారి నుండి ఉన్నతస్థాయి అధికారుల వరకు పారదర్శకత, సమాజంలో ఉన్న పేద బలహీనవర్గాల పట్ల మానవీయ కోణంలో విధులు నిర్వర్తించి కరీంనగర్ పోలీస్ అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొనడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సంవత్సర కాలంలో జరిగిన వివిధ రకాల ఎన్నికల సందర్భంగా అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు సమర్థవంతమైన సేవలందించారని చెప్పారు. దుర్గామాత, గణేశ్ ఉత్సవాలు, రంజాన్, బక్రీద్, క్రిస్మస్ పర్వదినాల సందర్భంగా వివిధ మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు తమవంతు సహకారాన్ని అందించడం వల్లే శాంతియుత వాతావరణంలో ఉత్సవాల నిర్వహణ సాధ్యమైందని తెలిపారు. కమిషనరేట్‌లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఎలాంటి ఉద్రేకాలకు లోనుకాకుండా వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకువచ్చి శాంతియుత వాతావరణం నిర్మాణంలో తమవంతు పాత్రను నూటికి నూరుశాతం సమర్ధవంతంగా నిర్వర్తించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కూడా సీపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీలు చంద్రమోహన్, శ్రీనివాస్, పలువురు ఎసీపీలు పాల్గొన్నారు.