JMS News Today

For Complete News

ఆ టర్నోవర్ కి చేరుకోవడం లక్ష్యం…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జనవరి 17: పాల సేకరణ, పాలు, పాల పదార్థాల విక్రయాలకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పెంపొందించడం ద్వారా 70 వేల మంది రైతులకు ఆర్థిక తోడ్పాటునందిస్తున్న కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్( కరీంనగర్ డెయిరీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు వందల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతోందని సంస్థ చైర్మన్ చల్మెడ రాజేశ్వర రావు తెలిపారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత 347 కోట్ల టర్నోవర్ ను అధిగమించేందుకు వీలుగా లక్ష్యాలు నిర్దేశించుకున్నామ న్నారు. ఇప్పటివరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే పరిమితమైన పాల సేకరణను సిద్దిపేట, జనగామ, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు విస్తరించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లో మరో 15 బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. డైరీ విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో రోజు మూడు లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యంతో 63 కోట్ల వ్యయంతో మెగా డైరీ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. మెగా డైరీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పది కోట్ల రూపాయల గ్రాంట్ మంజూరు చేసిందన్నారు. నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులు అందించాలనే ఉద్దేశంతో మెగా డైరీ పూర్తి యాంత్రీకరణతోనే పనిచేస్తుందన్నారు. 2018- 19 ఆర్థిక సంవత్సరంలో 539.83 లక్షల లీటర్ల పాల అమ్మకాలు చేపట్టగా,2019-20లో 550.42 లక్షల లీటర్ల మేరకు పాలను విక్రయించలిగామన్నారు. ప్రస్తుత సంవత్సరం 600 లక్షల లీటర్ల పాలను విక్రయించాలన్నది సంస్థ లక్ష్యమన్నారు. నిర్వహణ వ్యయాన్ని తగ్గించి సంస్థ లాభాలను పెంచాలన్న ఉద్దేశంతో కరీంనగర్ లోని ప్రధాన డైరీ తోపాటు, ప్రస్తుతం నడుస్తున్న అన్ని బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలలో సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. రైతులకు తక్కువ ధరలో నాణ్యమైన ఎరువులు అందించేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఫెర్టిలైజర్ విక్రయాల కోసం హక్కులు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే సంస్థ ఆధ్వర్యంలో 25 రిటైల్ కౌంటర్లు ఏర్పాటు చేసి గ్రామ పాడి సంస్థల ద్వారా రైతులకు కావలసిన ఎరువులు అందజేస్తున్నామని తెలిపారు. ఇటీవలే డైరీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశామని, జగిత్యాల జిల్లా కేంద్రంలో 35, కరీంనగర్లో 25 వాణిజ్య దుకాణ సముదాయాలు నిర్మించి వ్యాపారులకు కేటాయించడం ద్వారా డైరీకి అదనపు ఆదాయాన్ని సమకూర్చగలిగా మన్నారు. కరీంనగర్ డైరీ పెరుగుకు రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉందని, 2019-20లో 1.38 లక్షల కిలోల పెరుగు అమ్మడం ఇందుకు నిదర్శనమన్నారు. పాల సేకరణ అమ్మకాలతో పాటు తమ అనుబంధ ఉత్పత్తులైన దూద్ పేడ, మలాయ్ లడ్డు, మిల్క్ కేక్, బాసుంది, లస్సీ, బట్టర్ మిల్క్ లకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. కోవిడ్ దృశ్య త్వరలోనే హై ప్రోటీన్స్ ఉండేలా లిక్విడ్ ను మార్కెట్ లోకి తీసుకురానున్నామని, ఇందుకు సంబంధించి ట్రయల్స్, ల్యాబ్ టెస్టింగ్ ప్రక్రియ పూర్తయిందన్నారు. పాల సేకరణ పెంపులో భాగంగా పాడి రైతులు ఇతర రాష్ట్రాల నుండి పాడి పశువులు కొనుగోలు చేసుకోవడానికి వీలుగా ఒక్కో పశువుకు 60 వేల రూపాయల రుణం మంజూరు చేయడమే కాకుండా, 90శాతం రవాణా ఖర్చులు, మరో 90 శాతం పశు బీమాను తామే భరిస్తామని చెప్పారు. పాడి రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న కరీంనగర్ డైరీ ప్రస్తుత సంవత్సరం కళ్యాణమస్తు పథకం కింద 760 మంది పాడి రైతుల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లకు 86 లక్షల ఖర్చుతో పుస్తె, మట్టెలు అందజేయడం జరిగిందన్నారు. రైతు భరోసా కింద మరణించిన101 పాడి రైతులకు ఒక్కొక్కరికీ 50 వేల రూపాయల చొప్పున 50.50 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు.1245 మంది విద్యార్థులకు 9.96 లక్షల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించామన్నారు. అధిక పాల ఉత్పత్తికి అవసరమైన ఆడ పాడి దూడల జననం కోసం పాడి రైతులకు50 శాతం సబ్సిడీపై సార్టెడ్ సెమన్ అందజేస్తున్న మన్నారు. స్టార్టెడ్ సెమెన్ ద్వారా నూటికి నూరు శాతం ఆడ దూడలు జన్మించే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు 256 డోసుల సార్టెడ్ సెమెన్ రైతులకు అందించగా 66 ఆడ దూడలు జన్మించడం జరిగిందన్నారు. పశుగ్రాసం కోసం ఈ సంవత్సరం 50 శాతం సబ్సిడీపై రైతులకు చాప్ కట్టర్స్ అందజేశామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సంస్థ డైరెక్టర్లు స్వామి రెడ్డి, ప్రభాకర్ రావు, సంస్థ అడ్వైజర్ హనుమంత రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.