కేసీఆర్ డిల్లీ టూర్ కు సింగ్ కు ఛాన్స్…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 25: డిల్లీ టూర్ లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఉండటం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశమైంది. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సర్దార్ రవీందర్ సింగ్ కు సమాచారం అందడంతో అయన హుటాహుటిన ప్రగతిభవన్ పయనమయ్యారు. ముఖ్యమంత్రి వెంట ప్రత్యేక విమానంలో రవిందర్ సింగ్ డిల్లీకి బయలు దేరివెళ్ళారు. ఆకస్మికంగా మాజీ మేయర్ కు సిఎం కార్యాలయం నుండి ఫోన్ రావడం, సిఎం డిల్లీ టూర్ లో సింగ్ కు ఛాన్స్ రావడం పార్టీ శ్రేణుల్లో ఒకింత ఉత్కంఠ మోపైంది. కాగా, టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరిన కేసీఆర్తో తెలంగాణ కేబినెట్లోని పలువురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు బయలుదేరినట్లు సమాచారం. వీరంతా కేసీఆర్ ఢిల్లీ టూర్ ముగిసేదాకా ఆయనతో పాటే ఉండనున్నారు. కేసీఆర్ ఢిల్లీ టూర్ ఎన్ని రోజుల పాటు జరుగుతుందన్న విషయంపై స్పష్టమైన సమాచారమేదీ లేదు. కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని చెప్పిన అధికారిక యంత్రాంగం అక్కడ ఆయన టూర్ షెడ్యూల్ ఇలా ఉంటుందని ప్రకటనేమీ విడుదల చేయలేదు. రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలో కేసీఆర్ పర్యటించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో పలు పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలతో కేసీఆర్ మంతనాలు సాగిస్తారని తెలుస్తోంది. మొత్తానికి మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ డిల్లీ వెళ్ళగా, వారితో కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూడా వెళ్ళడం ప్రస్తుత చర్చనీయాంశమైంది.