తెలంగాణ బిజెపి రథసారధిగా బండి…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, మార్చి 11: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు బండి సంజయ్ ఎంపికను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఖరారు చేసినట్టుగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి ఇప్పటివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కె.లక్ష్మణ్ నే మరోసారి కొనసాగిస్తారని ప్రచారం జరిగినా, కొత్త వ్యక్తి వైపే బిజెపి అధిష్టానం మొగ్గు చూపింది. రాష్ట్ర అధ్యక్ష పదవికి సంజయ్ తోపాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ మంత్రి డి.కే.అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు పోటీ పడుతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే, ఆర్ఎస్ఎస్, ఏబివిపి లో పనిచేసిన అనుభవంతో పాటు అనేక ఇతర సమీకరణలు కలిసిరావడంతో బండి సంజయ్ కి అధ్యక్ష పదవి వరించింది.
* కార్పొరేటర్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడి దాకా…
కరీంనగర్ లో క్షేత్ర స్థాయి నుంచి ఎదిగిన నేత బండి సంజయ్. ఆయన ఆర్ఎస్ఎస్, ఏబీవీపీల్లో పనిచేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పలుమార్లు కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. కరీంనగర్ నుంచే రెండు సార్లు అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే రెండు సార్లూ గట్టి పోటీ ఇచ్చి అందరి దృష్టిలో పడ్డారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వం గత లోక్ సభ ఎలక్షన్లలో ఆయనకు కరీంనగర్ లోక్ సభ టికెట్ ఇచ్చింది. అక్కడి నుంచి గతంలో ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్, తాజామాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ బంధువు వినోద్ టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగారు. అయినా బండి సంజయ్ విస్తృతంగా తిరిగి, ప్రజలను కలిశారు. టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పై ఏకంగా 90 వేల ఓట్లకుపైగా మెజారిటీతో గెలిచారు. ఇలా సంజయ్ ప్రస్థానం కొనసాగింది. కాగా, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం కావడం పట్ల ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
బండి సంజయ్ ప్రొఫైల్
————-
* పేరు: బండి సంజయ్ కుమార్
* పుట్టిన తేదీ:11-7-1971
* తల్లిదండ్రులు: (కీ.శే. బండి నర్సయ్య) – శకుంతల.
* బీసీ వర్గానికి చెందిన సంజయ్ భార్య అపర్ణ స్టేట్ బ్యాంకు ఉద్యోగి. వారికి ఇద్దరు పిల్లలు సాయి భగీరత్, సాయి సుముఖ్
* చిన్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ లో పనిచేశారు.
* ఏబీవీపీ కరీంనగర్ పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షుడిగా,రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు.
* కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో రెండు సార్లు డైరెక్టర్ గా పనిచేశారు.
* భారతీయ జనతా యువమోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా, జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. మోర్చాకు కేరళ, తమిళనాడు ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహించారు.
* అద్వానీ రథయాత్రలో కొంతకాలం వెహికల్ ఇంచార్జిగా ఉన్నారు.
* కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మూడు సార్లు కార్పొరేటర్ గా గెలిచారు.
* 2014, 2018 అసెంబ్లీ ఎలక్షన్లలో కరీంనగర్ సెగ్మెంట్లో బీజేపీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు.
* 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా ఘనవిజయం సాధించారు.
* 2020లో రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం.