వారి భేటీ వారికోసమే…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
న్యూ ఢిల్లీ, ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ మధ్య తరచుగా భేటీ కావడం వెనుక రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు ఏ మాత్రం లేవని, కేవలం ఇద్దరి స్వప్రయోజనాలు మాత్రమే దాగున్నాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలో జరిగిన అవినీతి ఆర్థిక లావాదేవీలను, భూ దందాలను ఇరువురు ముఖ్యమంత్రులు అడ్డదారుల్లో పరిష్కరించుకునేందుకు తరచుగా భేటీ అవుతున్నారు విమర్శించారు. ఢిల్లీ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో చంద్రబాబుతో ఇలాంటి నాటకాలు ఆడిన కేసీఆర్ ప్రస్తుతం జగన్ తో అలాంటి నాటకాలే ఆడుతున్నారని అన్నారు. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల జగన్ అనుచరులు సాధించిన భూదందాలను, ఆర్థిక నేరాలను పరిష్కరించుకొని ఆర్థికంగా ఎదిగేందుకు, ఈ క్రమంలో వాటాలు పంచుకునేందుకే ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారని ఆరోపించారు. కెసిఆర్, జగన్ లు ఎన్నిసార్లు భేటీ అయిన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న బీజేపీని అడ్డుకోలేరని, నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి బలమైన జాతీయ నాయకత్వం సుపరిపాలన అంత్యోదయ అభివృద్ధి లక్ష్యంగా ఇప్పటికే 17 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారని, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారం సాధిస్తుందని తెలిపారు. ఉద్యమ సమయంలో కెసిఆర్ తీరు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, జగన్ లతో వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. తుపాకి రాముడు మాయల ఫకిర్ వేషాలతో తెలంగాణ ప్రజలను మోసగిస్తున్న కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు ప్రజా కోర్టులో శిక్ష విధిస్తారని చెప్పారు. మహా కూటమి ఫెడరల్ ఫ్రంట్ లతో ఆడిన నాటకాలు సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పొందిన మాదిరిగానే రానున్న ఎన్నికల్లో ఇరు రాష్ట్రాల్లో బిజెపి చేతిలో కెసిఆర్, జగన్ ప్రభుత్వాలు కూలి ప్రజాభ్యున్నతి కోసం బిజెపి అధికారంలోకి వస్తుందని సంజయ్ జోస్యం చెప్పారు.