JMS News Today

For Complete News

మాకు సంతోషమే..వాళ్ళకే లేదు

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జనవరి 27: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు సంతోషాన్ని ఇచ్చాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇదే స్పూర్తితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. గతంతో పోల్చితే బీజేపీకి గణనీయమైన ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు. ఫలితాల సందర్భంగా సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎంపీ సంజయ్ మాట్లాడారు. 60 డివిజన్లకు గాను 53 చోట్ల పోటీ చేసి13 స్థానాలు గెలుచుకున్నామని చెప్పారు. చాలా డివిజన్ లలో స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిలిచామని వివరించారు.
గత కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 2 స్థానాలే గెలుచుకుందని, ఈ సారి బలం 13కు పెరిగిందని పేర్కొన్నారు. ఒక్కో ఎన్నికల్లో క్రమంగా పుంజుకుంటూ బీజేపీ పట్టు సాధించుకుంటోందని వివరించారు. బీజేపీ ఎదుగుతున్న తీరుతో భవిష్యత్తులో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమ పద్ధతుల్లో గెలవాలని ప్రయత్నించిన టీఆర్ఎస్ డివిజన్ విభజన దగ్గర నుంచి పోలింగ్ వరకు అడుగడుగునా అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి బీజేపీని ఎదుర్కోవాలని ప్రయత్నించినప్పటికీ గట్టి పోటీ ఇవ్వగలిగామని పేర్కొన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డాయని ధ్వజమెత్తారు. ఎంఐఎం పోటీ చేసిన చోట టీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని అన్నారు. కొన్నిచోట్ల ఎంఐఎం ఓ వర్గం ఓట్లను గంపగుత్తగా టీఆర్ఎస్ కు వేయించిందని తెలిపారు. టీఆర్ఎస్, ఎంఐఎం లోపాయికారి ఒప్పందంతో వ్యవహరించాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్థులు కొన్నిచోట్ల కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా రూ.80 ఖర్చు చేశామని చెప్పడం విడ్డూరమని విమర్శించారు. చాలా డివిజన్లలో కాంగ్రెస్ నామమాత్రంగా అభ్యర్థులను బరిలో నిలిపినప్పటికీ పోటీ ఇవ్వడంలో ఆసక్తి చూపలేదని విమర్శించారు. కాంగ్రెస్ పరోక్షంగా టీఆర్ఎస్ గెలుపు కోసమే కృషి చేసిందని పేర్కొన్నారు. పార్లమెంట్ చట్టాన్ని సీఎం అసెంబ్లీలో వ్యతిరేకిస్తారట,
బైంసా అల్లర్లను గల్లీ గొడవ అనీ సీఎం అంటున్నారని విమర్శించారు. మేము 13 గెలిచినా సంతోషంగా ఉందని, వాళ్లు 33 గెలిచినా ఆనందం లేదని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ కార్పోరేషన్ అభివృద్ధికి సహకరిస్తామని, అవినీతికి ఆస్కారం లేకుండా నాణ్యంగా స్మార్ట్ సిటీ పనులు జరిగేలా బీజేపీ డేగ కన్నుతో కాపలాగా ఉంటుందని చెప్పారు. భైంసా అల్లర్లలో చనిపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోలేదని, గెలిచిన బీజేపీ కార్నోరేటర్లు, కౌన్సిలర్ల ఒక నెల గౌరవ వేతనాన్ని బైంసా బాధితులకు అందిస్తామని, అవసరమైతే జోలె పట్టి వాళ్ళను ఆదుకుంటామని అన్నారు. కేటీఆర్ ఇలాకాలో 13 మంది ఇండిపెండెంట్లు గెలిచారని చెప్పారు.ఎన్నికల ముందు రాజకీయాలు చేద్దామని, ఎన్నికల అనంతరం కలిసి ప్రజలకు అభివృద్ధి చేసి చూపిద్దామని తెలిపారు. మేము తప్పుడు ఆరోపణలు చేయమని అన్నారు. కేసీఆర్ 10 లక్షలతో సీఏఏకు వ్యతిరేకంగా సభ నిర్వహిస్తే, మేము 20 లక్షలతో సభ పెడతామని సవాల్ విసిరారు. ఇక్కడ బాంబులు పేల్చే వాళ్ళకి పౌరసత్వం ఇమ్మంటారా? అంటూ ప్రశ్నించారు.
మీకు భయపడేది లేదని, ఏన్నార్సీ తెస్తామని అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో రెండు స్థానాల నుంచి 13 స్థానాలకు చేరుకోవడం బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధిస్తామని సంజయ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *