ఇప్పుడే ఎన్నికలేందుకు….
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 7: పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా, రాష్ట్రంలో ఆగమేఘాల మీద మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొచ్చిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా…ఇక్కడ కాషాయం జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్ నగరంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తో కలిసి సంజయ్ బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మోసం చేయడంలో టిఆర్ఎస్ నెంబర్‌వన్ పార్టీ అని విమర్శించారు. కెసిఆర్ హయాంలో అరాచక పాలన కొనసాగుతుందని ఆరోపించారు. కేరళ, బెంగాల్ తరహాలోనే ఇక్కడ బీజేపీ కార్యకర్తలపై దాడులు, వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ అరాచకాలను అడ్డుకుంటామని చెప్పారు. బిజెపి కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మరోమారు బండి ఆరోపించారు. కరీంనగర్లో ఎంఐఎం పాగా వేయాలని ప్రయత్నిస్తోందని అన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ డబ్బే కీలకంగా మారిన ఎన్నికల్లో సంజయ్ కుమార్ ను గెలిపించిన కరీంనగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ దేశాలకు కరీంనగర్ ఎన్నిక ఆదర్శమని, డబ్బు ప్రభావం ఇక్కడ పనిచేయదని ప్రజలు నిరూపించారని చెప్పారు. 2024 నాటికి దేశంలోని ప్రతి ఇంటికి నల్లా నీరు, ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందని, ఆ దిశగా పని చేస్తుందని అన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎవరి వల్ల వచ్చిందో టిఆర్ఎస్ పెద్దలు చెప్పాలని, కాలేశ్వరం ప్రాజెక్టు ఫారెస్ట్ క్లియరెన్స్ అనుమతులు ఇచ్చింది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని, రాష్ట్రంలో బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు, నగర అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి, నాయకులు కటకం లోకేష్, కొట్టే మురళి కృష్ణ, ప్రవీణ్ రావు, రాపర్తి విజయ, సుజాత, స్వప్న, హరికుమార్ గౌడ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.