వాటి వ్యతిరేకతపై ఒక్క కారణం చెప్పండి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, డిసెంబర్ 28: సిఎఎ, ఎన్పీఆర్ పై వ్యతిరేకత ఎందుకో కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం, వామపక్షాలు సమాధానం చెప్పాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. వ్యతిరేక ఆందోళనలకు ఒక్క కారణమైనా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఎంపీ సంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టంపై వ్యతిరేక ఆందోళనలు దేశద్రోహుల కుట్ర అని, అసోం వంటి పలు రాష్ట్రాల్లో ఇస్లామిక్ దేశాల నుంచి వస్తున్న నిధులతోనే విపక్షాల నిరసన ప్రదర్శనలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో టీఆర్ఎస్ నిధులు ఇస్తూ సీఏఏ వ్యతిరేక ఆందోళనలు చేయిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం, వామపక్షాల తీరును ప్రజలు గమనిస్తువ్నారని ఎంపీ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. నిజామాబాద్ సభలో పాల్గొన్న ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హిందువులకు వ్యతిరేకం కాదంటూ ఒవైసీ కంటి తుడుపు ప్రకటన చేశారని బండి సంజయ్ అన్నారు. దేశంలో పోలీసులు 15 నిమిషాలు తప్పుకుంటే హిందువులను అంతం చేస్తామన్న వ్యాఖ్యలు హిందువులకు వ్యతిరేకం కాదా…? అని నిలదీశారు. హిందువుల పట్ల వ్యతిరేకత లేకపోతే అయోధ్య అంశంలో సుప్రీం కోర్టు తీర్పును ఎంఐఎం ఎందుకు తప్పుబట్టిందని బండి సంజయ్ కుమార్ ఆ ప్రకటనలో ప్రశ్నించారు. లౌకికవాద పార్టీ అంటూ గొప్పగా ప్రకటించుకునే టీఆర్ఎస్ సిఎఎ, ఎన్పీఆర్ ను ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో పౌరుల వ్యక్తిగత వివరాలు సేకరించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్పీఆర్ ను వ్యతిరేకించడం ద్వంద్వ విధానం కాదా? అని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, అలజడి సృష్టించేందుకు కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్, వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. భారత్ మాతా కీ జై అనని పార్టీలు కూడా దేశం గురించి మాట్లాడటం విడ్డూరమని ధ్వజమెత్తారు. జాతీయ జెండాను ఎగురవేయని, జనగణమన ఆలపించని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్.. నరేంద్ర మోదీ పాలన విధానాలతో దిగిరాకతప్పలేదని చెప్పారు. జాతీయ జెండా ఎగురవేయడంతో పాటు జనగణమన ఆలపించడం మోదీ పాలన ఫలితమేనని తెలిపారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్ లో మైనారిటీలపై హింసను ఏనాడూ ప్రశ్నించని ఎంఐఎం ఆ దేశాల నుంచి భారత్ వచ్చే శరణార్ధులకు పౌరసత్వం ఇవ్వడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తోందని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని, ప్రజలంతా ఏకమై బీజేపీకి మద్దతుగా నిలుస్తారని సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.