వారికి అండగా ఉంటాం…
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
న్యూ ఢిల్లీ, జూలై 31: మద్య మానేరు ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యల సాధన కోసం నిర్వాసితుల ఐక్యవేదిక, అఖిలపక్షం ఆధ్వర్యంలో ముంపు గ్రామాల బాధిత ప్రజలు బుధవారం చేపట్టిన పాదయాత్రకు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ సంఘీభావం ప్రకటించారు. వారి సమస్యల సాధనకు భారతీయ జనతా పార్టీ పక్షాన ఉద్యమాలు నిర్వహించి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, ముంపు గ్రామాల బాధితులు బావి తరాల భవిష్యత్తుకు త్యాగధనులని అభివర్ణించారు. కన్న ఊరును, ఉన్న ఇంటిని కన్నీళ్లతో అప్పగిస్తే కనికరం లేకుండా కెసిఆర్, కేటీఆర్ లు ప్రవర్తించడం బాాధాకరమని అన్నారు. వేములవాడ రాజన్న సాక్షిగా ఇచ్చిన హామీ డబుల్ బెడ్ రూమ్ పథకం కింద ప్రతి నిర్వాసిత కుటుంబానికి 5లక్షల నాలుగువేల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 2009 తెలంగాణ ఉద్యమ సమయం నుండి నిర్వాసితులకు అండగా ఉంటానంటూ నమ్మిస్తూ కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. మల్లన్న సాగర్ నిర్వాసిత కుటుంబాలకు ఇచ్చిన ప్రతి హామీని మద్య మానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. తన సొంత గ్రామం అమ్మ గారి ఊరు చింతమడక పై ప్రేమను తన అర్ధాంగి అత్తగారి ఊరు కొదురుపాక పై కూడా చూపాలని అన్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తన సభ్యులకు దక్కిన మాదిరిగానే ప్రతి పరిహారం ప్రస్తుతం 18 ఏళ్లు దాటిన యువతీ యువకులందరికీ దక్కేలా ముఖ్యమంత్రి కెసిఆర్, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవ చూపి ముంపు గ్రామాల బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని కోరారు. 2015లో ముఖ్యమంత్రిగా వేములవాడ రాజన్న సాక్షిగా ఇచ్చిన హామీ 2019 చివరి నాటికి 18 ఏళ్లు దాటిన యువతీ యువకులకు దక్కేలా రెండు లక్షల రూపాయలతో పాటు ఇంటి స్థలం కేటాయించాలని, కొత్త గెజిట్ జాబితా జారీ చేసి పరిహారం లభించని ప్రతి ఒక్కరికి పట్టా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామాల యువకులకు కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని, ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాల కోసం ముంపు గ్రామాల ప్రజలకు ప్రత్యేక కోటా ఏర్పాటు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.