పోలీసుల జాబ్ మేళాకీ విశేష స్పందన..
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 26: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కరీంనగర్ కమీషనరేట్ పోలీసులు మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. కరీంనగర్ లోని పద్మనాయక కళ్యాణ మండపం ఆవరణలో ఈ జాబ్ మేళాను నిర్వహించారు. 70 కిపైగా మల్టీ నేషనల్ ప్రైవేట్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు విచ్చేసి ఇంటర్వ్యూలను నిర్వహించారు. 3వేల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు నిర్వహించిన ఈ మేళాకు 6వేలకుపైగా నిరుద్యోగులు హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ కొనసాగింది. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, బిటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, నర్సింగ్ విభాగాల్లో విద్యార్హతలు కలిగి ఉన్న యువత ఈ జాబ్ మేళాకు హాజరయ్యారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఉద్యోగాల నియామకం కోసం కూడా ఇంటర్వ్యూలు జరిగాయి. వివిధ విభాగాల్లో 3 వేల మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసి నియామక పత్రాలను అందజేశారు. ఎంపికైన అనేకమందికి విద్యాభ్యాసం కొనసాగించేందుకు వీలుండే ఉద్యోగాలు కూడా లభించాయి. ఈ సందర్బంగా రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితాలను ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. 20 నుండి 30 శాతం వరకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయని మిగతా 70 శాతం అవకాశాలు ప్రైవేటు రంగాల్లో ఉంటాయని తెలిపారు. ఒకపక్క శాంతిభద్ర విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తూనే మరోపక్క కమీషనరేట్ పోలీసులు నిరుద్యోగుల కోసం జాబ్ మేళాను నిర్వహించడం అభినందనీయమన్నారు. శాంతియుత వాతావరణం నిర్మాణం ద్వారానే అభివృద్ధి ముందుకు సాగుతూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, కార్పొరేటర్ తోట రాములు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రాజు, అడిషనల్ డిసిపిలు ఎస్ శ్రీనివాస్ (ఎల్ అండ్ ఓ) జి చంద్రమోహన్ (పరిపాలన) ఏసీపీలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, విజయ్ కుమార్, సి ప్రతాప్, ఎస్బిఐ జి.వెంకటేశ్వర్లతో పాటుగా పలువురు పోలీసు అధికారులు, ఎన్ సిసి క్యాడేట్లు పాల్గొన్నారు. కాగా, ఈ మేళాకు కో-ఆర్డినేటర్లుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ & మోటివేటర్ స్పీకర్ రఘురామరాజు, చందర్ లు వ్యవహరించారు.