ఆలా వాహనాలతో వెళితే…అంతే….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, నవంబర్ 24: నంబర్ ప్లేట్ టాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని నగర ఏసీపీ శ్రీనివాసరావు తుల హెచ్చరించారు. కరీంనగర్ సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు కరీంనగర్ వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ సిఐలు, కరీంనగర్ ట్రాఫిక్ సిఐ నాగార్జునలతో కూడిన పోలీసు బృందాలు కరీంనగర్ పట్టణంలో జాయింట్ స్పెషల్ డ్రైవర్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ జాయింట్ స్పెషల్ డ్రైవ్ లో పోలీసులకు చాలా వాహనాల యొక్క నంబర్ ట్యాంపరింగ్ చేస్తున్నట్టుగా దృష్టికి వచ్చిందని, అంతేకాకుండా పోలీసుల చలానా నుండి తప్పించుకొనుటకు, వేగంగా వెళ్తున్నప్పుడు పోలీసులకు నెంబర్ కనపడకుండా ఉంచుటకు కొంతమంది పోకిరీలు రకరకాల వింత పోకడలు పోతున్న విషయం కూడా దృష్టికి వచ్చిందని వివరాంచారు. ఇందులో కొంత మంది తమ నంబర్ లోని కొన్ని అక్షరాలను విరిచి వేయగా, మరి కొంతమంది కరోనా నివారణకు ఉపయోగించే ఫేస్ మాస్క్ లను నెంబర్ ప్లేట్ కు కట్టడం, హ్యాండ్ కర్చీఫ్ ని నెంబర్ ప్లేట్ కనపడకుండా కట్టడం, స్టిక్కర్స్ అంటించడం మొదలైన విపరీత పద్ధతులు పాటిస్తున్నట్టుగా దృష్టికి రావడం జరిగిందని, ఇటువంటి 50 వాహనాలను స్వాధీనం చేసుకొని వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొనుటకు పోలీస్ శాఖ సన్నద్ధమవుతోందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ చలానా వాహనదారులు తమ తప్పులను తెలుసుకొని ట్రాఫిక్ నిబంధనలు పాటించడానికి, తద్వారా భవిష్యత్తులో తమ తప్పుల వల్ల, నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాన్ని నివారించడానికి ఉద్దేశించబడినది అనే విషయం గమనించాలని ప్రజలను కోరారు. ఎంతోమంది యువకులు ఉత్సాహంతో తమ తల్లిదండ్రుల వద్ద స్తోమత లేకున్నా మోటార్ సైకిల్ లను బలవంతంగా కొనిపించుకుని, హెల్మెట్ లేకుండా జోష్ లో వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నవి, ఇలాంటి ప్రమాదాలు నివారించుటకు పోలీసులు చలానాలు విధిస్తున్నారని వారిలో పరివర్తన తీసుకొని వచ్చి ట్రాఫిక్ నిబంధనలను పాటించినట్టు అయితే క్షేమంగా ఇంటికి చేరుకుంటారన్న పోలీసుల ఉద్దేశాన్ని గమనించాలని కోరారు. అంతేకాకుండా ఇలాంటి స్పెషల్ డ్రైవ్ ప్రతిరోజు కరీంనగర్ పట్టణమంతా ఉంటుందని, వాహనదారులు పరివర్తన వచ్చి ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించే అంతవరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని వెల్లడించారు. ఎవరైనా ఇలా నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసి పోలీసుల కళ్ళు కప్పి బయట పడదామనే ఆలోచన ఉన్న వారు తమ వాహనాలను ఇంటిలో భద్రంగా దాచి పెట్టుకోవాలని ఎసీపీ శ్రీనివాస రావు సూచించారు.