ఆ సీఎం కు అస్వస్థత…
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కర్నాటక, జూలై 21: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. ఆయన కొద్దిసేపటి క్రితమే అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని జేడీఎస్ వర్గాలు వెల్లడించాయి. సోమవారం అసెంబ్లీలో కీలకమైన విశ్వాస పరీక్షను కుమారస్వామి సర్కార్ ఎదుర్కోనున్న నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, కుమార స్వామి ఆసుపత్రిలో చేరడంపై బీజేపీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కుమార స్వామి కొత్త డ్రామాకు తెరలేపారని, సాధ్యమైనంత వరకూ బలపరీక్షను పొడిగిస్తూ పోవాలన్నదే ఆయన ఆలోచనగా కనిపిస్తోందని వారంటున్నారు. కాగా, ఇప్పటికే రెండుసార్లు గవర్నర్ ఇచ్చిన బలపరీక్ష గడువు ముగియడంతో సోమవారమే బలపరీక్ష ఉంటుందని స్పీకర్ శుక్రవారం తేల్చిచెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు జేడీఎస్-కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నప్పటికీ అవి ఆశించిన విధంగా లేవని తాజా పరిణామాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో బలపరీక్షకు తాము దూరమని బీఎస్పీ ఎమ్మెల్యే ఇప్పటికే తేల్చిచెప్పగా, రాజీనామా నిర్ణయంలో మార్పు లేదని ముంబైలో బసచేసిన అసమ్మతి ఎమ్మెల్యేలు ఆదివారం మరోసారి కుండబద్ధలు కొట్టారు. ఈ పరిణామాలు కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో నిరాశను నింపుతుండగా, పైకి మాత్రం విశ్వాస పరీక్షలో గెలిచి తీరుతామని కాంగ్రెస్ చెబుతోంది. అయితే, కుమారస్వామి సర్కార్కు సోమవారమే ఆఖరి రోజని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఇవాళ కుండబద్ధలు కొట్టారు. దీంతో కర్నాటక రాజకీయ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ, ఉత్కంఠ రేేపుతోంది.