అమ్మవారికి బోనం సమర్పించిన కేసీఆర్
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
సికింద్రాబాద్, జూలై 21: జంట నగరాల్లో బోనాల సంబురం ప్రారంభమైంది. డప్పు చప్పుళ్లు, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాల మధ్య చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు సీఎంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి , కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, తెలంగాణ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా, అమ్మవారి దర్శనం కోసం ఆదివారం ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. తెల్లవారు జాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దాదాపుగా క్యూ లైన్లన్నీ నిండిపోయి ఆలయ ప్రాంగణం భక్తులతో కోలాహలంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు చేశారు.