JMS News Today

For Complete News

కరోనా ఎంటర్… సర్కార్ అలర్ట్…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, మార్చి 2: తెలంగాణలో తొలి సారిగా కరోనా వైరస్ (కోవిడ్-19) పాజిటివ్ కేసు నమోదైంది. బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే తెలంగాణకు చెందిన 24 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నమోదైంది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసు వ్యక్తి గాంధీ హాస్పిటల్ లో ఉండగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. కరోనా సోకిన వ్యక్తి ఫిబ్రవరి 17న దుబాయి వెళ్లి నాలుగు రోజుల పాటు హాంకాంగ్ వ్యక్తులతో కలిసి పని చేశారు. దుబాయ్ నుండి బెంగుళూరు వచ్చి అక్కడ ఒకరోజు తన ఆఫీస్ కి వెళ్లారు. 22 న బెంగుళూరు నుండి బస్సులో హైదరాబాద్ వచ్చాడు. దగ్గు తుమ్ములతో అపోలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. స్వైన్ ప్లూ కాదని తేలడంతో, గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ అని తెలియడంతో అతనితో ఈ వారం రోజులుగా కలిసిన వారందరి వివరాలు సేకరిస్తున్నారు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ యోగిత రాణా, ఆయుష్ డైరెక్టర్ అలుగు వర్షిణి, హైదరాబాద్ కలెక్టర్ దివ్య, డియంఈ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస రావు, టిఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎం డైరెక్టర్ శంకర్, కేంద్ర ప్రభుత్వం తరపున విమానాశ్రయ ప్రత్యేక వైద్యాధికారి డాక్టర్ అనురాధ, డబ్ల్యూహెచ్ఓ ప్రతినిదులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరికీ పరీక్షలు చేయిస్తామని, అనుమానం ఉన్నవారు ఇంట్లోనుండి బయటికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఆ బస్సులో 27 మంది ప్రయాణించినట్టు తెలిసిందని, ఆ 27 మందిని ట్రెస్ చేస్తున్నామని, వైరస్ సోకిన వ్యక్తి నేరుగా కలిసిన 80 మందిని గుర్తించామని, వారికందరికి టెస్టులు చేస్తామని తెలిపారు. పాజిటివ్ కేసుగా నమోదైన వ్యక్తిని ఐసోలేషన్ వార్డులో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నామని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పూర్తి అప్రమత్తతో ఉన్నామని స్పష్టం చేశారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ను సంప్రదించి, టెస్టులు చేయించుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో దగ్గడం, తుమ్మడం లాంటివి చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు బ్రోచర్స్ ప్రింట్ చేసి జనసమ్మర్థ ప్రదేశాల్లో ఉంచుతామని, కరోనా స్ప్రెడ్ అవ్వకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలు భయాందోళనలు చెందవద్దని కోరారు. బయటనుండి వచ్చిన వారిలో మాత్రమే ఈ వైరస్ ఉంది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో నియంత్రణ చేయగలమని మంత్రి రాజేందర్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *