మరికొన్ని గంటల్లో…అరుదైన ఘట్టం
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 16: మరికొన్ని గంటల్లో అందాల జాబిలమ్మ సిగలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఒకేరోజు..అందులో గంటల వ్యవధిలో…పౌర్ణిమ, గ్రహణం రావడం అరుదైన సందర్భం.150 ఏళ్ళ తర్వాత సాక్షాత్కరిస్తున్న అరుదైన ఘట్టం. ప్రతి ఏటా హిందువులు ఆషాడపౌర్ణమిని వేదవ్యాసుని జయంతికి గుర్తుగా గురుపౌర్ణమిగా జరుపుకుంటారు. మంగళవారం గురు పౌర్ణిమ. అయితే ఆ తర్వాత ఎనిమిది గంటల తేడాతో చంద్రగ్రహణం జరగ బోతోంది. ఇలా కొన్ని గంటలతేడాతో ఒకేరోజు గురుపౌర్ణిమ, చంద్రగ్రహణం రెండు సందర్భాలు రావడం అరుదుగా జరుగుతుంది. ఇంతకుముందు 1870 జూలై 12న ఒకే సమయంలో చంద్ర గ్రహణం, గురుపౌర్ణిమ వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు దాదాపు 150ఏళ్ళ తర్వా త అలాంటి సందర్భం రాబోతోంది. ప్రస్తుతం రాబేయే చంద్రగ్రహణం మంగళవారం రాత్రి ఉత్తరాషాఢ నక్షత్రం తొలిపాదంలో ఏర్పడి, రెండో పాదంలో ముగుస్తుంది. అంటే అర్థరాత్రి 1.30 నిమిషాలకు ధనుస్సు రాశిలో ప్రారంభమయ్యే చంద్ర గ్రహణం, తెల్లవారుజామున 4.31 నిమిషాలకు మకర రాశిలో ముగుస్తుంది. మొత్తం 178 నిమిషాల పాటు ఉండే ఈ చంద్రగ్రహణం పాక్షికంగానే మనకు కనిపిస్తుంది.150 ఏళ్ల తర్వాత మళ్లీ గురు పూర్ణిమ రోజున రావడం విశేషం. మేష, కర్కాటక, వృశ్చిక, సింహ, మీన రాశుల వారికి విశేష ఫలం ఈ గ్రహణం ద్వారా లభిస్తుందని జ్యోతిషులు వివరిస్తున్నారు. ఇక ఈ గ్రహణాన్ని పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల్లో పుట్టినవారు, ధనుస్సు, మకర రాశులకు చెందిన వారు చూడవద్దని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. అయితే, గ్రహణం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య ఉండటంతో, ఆ సమయంలో అత్యధికులు నిద్రలో ఉంటారు కాబట్టి, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాగా, చంద్రగ్రహణం కారణంగా ఆలయాలను మధ్యాహ్నం మూసివేశారు. బుధవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ చేసి భక్తులను అనుతిస్తారు.