JMS News Today

For Complete News

అయితే ఇటు..లేకపోతే అటు…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జనవరి 3 : కొత్త సంవత్సరం ఆరంభం…అందులో చలికాలం…గజగజ వణికించే చలికాలంలో ఎన్నికల వేడి రగిలిస్తుండగా, పుర పైట్ అందరిలోనూ ఆసక్తి, ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కాగా, ఎన్నికల సంఘం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. జనాభా, కులాల ప్రాతిపదికన, రొటేషన్ విధానంలో రిజర్వేషన్ల ప్రక్రియ రెండ్రోజుల్లో ఖరారు కాబోతుండగా, ఆశావహుల్లో టికెట్ గుబులు పట్టుకుంది. అన్ని పార్టీల్లో ఆశావహుల పోటీ ఉన్నప్పటికీ అధికార టీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఎక్కువగా ఉంది. అయితే, సొంత పార్టీలో టికెట్ రాని పక్షంలో మరో పార్టీ లో బెర్త్ (టిికెట్) కోసం ఆశావహులు పక్క చూపులు చూస్తున్నారు. అటు గెలపే లక్ష్యంగా గెలుపు గుర్రాలపైనే అన్ని పార్టీలు దృష్టి సారించి కమిటీలను కూడా వేసుకున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు కార్పోరేషన్లు, పద్నాలుగు మున్సిపాలిటీలలో ఎన్నికల ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చకాచకా ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సంఘం జనాభా, కులాల ప్రాతిపదికన, రొటేషన్ విధానంలో రిజర్వేషన్లను కూడా రెండ్రోజుల్లో ఖరారు చేయబోతోంది. ఇదిలా ఉండగా, పుర పోరు లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ముందుకు సాగుతుండగా, టికెట్ల వేడి రాజుకుంటోంది. ప్రతి పార్టీలో పోటీ ఉండగా, అధికార టీఆర్ఎస్ పార్టీలో మాత్రం తీవ్ర పోటీ ఉంది. పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పార్టీల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్ లో మంత్రులు గంగుల కమలాకర్, ఈటెల రాజేందర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించి, టికెట్ల కేటాయింపు విషయంలో ప్రత్యేక కమిటీలను కూడా వేసుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ 16 మందితో కూడిన కమిటీని వేయగా, బిజెపి ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. మిగిలిన పార్టీలు సైతం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించాయి. అయితే, గెలుపే లక్ష్యంగా గెలుపు గుర్రాలపైనే అన్ని పార్టీలు దృష్టి సారిస్తుండగా, ఆశావహుల్లో టికెట్ భయం వెంటాడుతోంది. ఎంత ఖర్చయిన పోటీ చేసేందుకు రెడీగా ఉన్నప్పటికీ, టికెట్ దక్కకపోతే ఎలా ? అన్న ప్రశ్న మాత్రం వారిని వేధిస్తోంది. పెద్దల ఆశీస్సులు ఎవరికీ ఉంటే వారికే టికెట్ దక్కే అవకాశం ఉన్న దరిమిలా ఆశావహులు ఆ నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయినా టికెట్ రానిపక్షంలో ఏం చేయాలనే అంశంపై తమ స్నేహితులతో మంతనాలు జరుపుతున్నారు. ఏకంగా కొందరు ఇతర పార్టీల్లో బెర్తులు కన్ఫర్మ్ చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మొత్తానికి కొత్త సంవత్సరం ఆరంభం… అందులో చలికాలంలో కూడా వేడి పుట్టిస్తున్న పుర పోరులో ఓ వైపు ఆశావహులు కొత్త క్రేజ్ తో ఉరకలేస్తూ ముందుకు సాగుతుండగా, గెలుపు గుర్రాలపైనే పార్టీలు దృష్టి పెట్టిన దరిమిలా, టికెట్ దక్కే విషయంలో కొంత ఆందోళనకు గురిచేస్తుండగా, మరోవైపు ఎన్నికల సమయం సమీపిస్తున్నా కొద్ది పుర పోరు రసవత్తరంగా మారుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *