రాత్రికిరాత్రే అనూహ్య పరిణామాలు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
ముంబాయి, నవంబర్ 23: మహా రాజకీయాల్లో రాత్రికి రాత్రే ఎవరూ ఊహించని అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మహరాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ కొద్ది సేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ప్రమాణం చేశారు. వీరితో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ శనివారం ఉదయం ప్రమాణం చేయించారు. ఎవరూ ఊహించని, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భాజపా-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మిత్రపక్షమైన శివసేనకు భాజపా గట్టి షాక్ ఇచ్చినట్లయింది. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నామని శుక్రవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించిన గంటల్లోనే అంతా తారుమారై ఈ పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేసింది. కాగా, సీఎంగా ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మొత్తానికి గత కొన్ని రోజులుగా అనేక మలుపులు తిరిగిన మహ రాజకీయ కథ ప్రమాణ స్వీకారంతో ముగిసినట్లయింది.