డాక్టర్ల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 28: ఉమ్మడి కరీంనగర్ (కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల) జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో 20 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిపై భర్తీ చేసేందుకు ఈనెల 31న వాక్ ఇన్ ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. శశాంక ఒక ప్రకటనలో తెలిపారు. ఒక సంవత్సరం పాటు (అవసరమైతే పెంచబడుతుంది) కాంట్రాక్ట్ పద్దతిలో పని చేసేందుకు నిర్వహించే ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ లో ఎంపికైన అభ్యర్థులకు నెలకు 40,270 రూపాయల జీతంతో పాటు తగు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న, ఎంబీబీఎస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 31న కరీంనగర్ లోని కలెక్టరేట్ ఆడిటోరియం లో ఉదయం 11 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువ పత్రాలతో పాటు, ప్రత్యేకించి ఎస్ ఎస్ సి,ఎం బి బి ఎస్, సమీకృత కుల దృవీకరణ పత్రం, ఇటీవల తీసుకున్న రెండు కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సహా టీఎస్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తో హాజరు కావాలని సూచించారు. ఈనెల 27న హైదరాబాదులో నిర్వహించిన వాక్ ఇన్ ఇంటర్యూ కు హాజరైన డాక్టర్లు తిరిగి కరీంనగర్ లో నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరు కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.