పరిష్కారం కోసం పాదయాత్ర….
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రాజన్న సిరిసిల్ల, జూలై 31: మిడ్ మానేరు భూ నిర్వాసితుల పాదయాత్ర బుధవారం ఉదయం ప్రారంభమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం నీలోజీపల్లి నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కాగా, సిరిసిల్ల జిల్లా కేంద్రం వరకు దాదాపు 15 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగనుంది. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించనున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, వేములవాడ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్, బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నేత పోల్సాని సుగుణాకర్ రావు, ప్రతాప రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మిడ్ మానేరు బాధితులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చింతమడకపై చూపిన ప్రేమను.. మిడ్ మానేరు భూ నిర్వాసితుల సమస్యలపై చూపడం లేదని విమర్శించారు. మిడ్ మానేరు భూ నిర్వాసితులు రాష్ట్ర ప్రజలు కారా? అని ప్రశ్నించారు. ఎంపీ సంతోష్ కుమార్ ఫారెస్టును దత్తత తీసుకోవడం కాదని… సొంత ఊరును దత్తత తీసుకోవాలని పొన్నం హితవు పలికారు. మిడ్ మానేరు భూనిర్వాసితుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాడతామన్నారు. అలాగే పలువురు నేతలు మాట్లాడుతూ మేజర్లైన యువతీ,యువకులకు ప్యాకేజీ వర్తింపజేయాలని, పరిహారం, పునరావా ప్యాకేజీ పెంచాలని, కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, పాదయాత్ర సందర్బంగా పోలీసులు భారీగా మోహరించారు.