నేను మీ పెద్ద కొడుకునవుతా…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 24: నేనున్నాను..మీ కుటుంబానికి పెద్దకొడుకునవుతా… అధైర్యపడొద్దు…పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటానంటూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెరాస కార్యకర్త గొర్రె అజయ్ కుటుంబానికి మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. సోమవారం రామడుగు మండలం దేశరాజుపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొత్తపల్లి మండలం నాగులమాల్యాల తెరాస గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు గొర్రె అజయ్ కుమార్ మృతదేహానికి మంగళవారం మంత్రి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెరాస పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు గొర్రె అజయ్ కుమార్ బస్సు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమని, అజయ్ చాలా చురుకైన కార్యకర్త అని అన్నారు. అజయ్ మృతి తెరాస పార్టీకి తీరని లోటని చెప్పారు. అజయ్ కుటుంబాన్ని పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని కుటుంబసభ్యులకు మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్, మాజీ ఎంపిపి వాసాల రమేష్, సీనియర్ నాయకులు బోనాల రాజేశం, గోదల చంద్రయ్య, జిల్లా కోఅప్షన్ సభ్యులు సాబీర్ పాషా, ఎంపీటీసీ సభ్యులు కొమ్ము హేమలత -రవికిరణ్, శ్రీపతి రావు, గోదల రంజిత్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.