మా పాలనకు గీటురాయి…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జనవరి 27: టీఆర్ఎస్ పాలనకు మున్సిపల్ ఎన్నికలే గీటురాయి. సీఎం కేసీఆర్ పాలన తీరు, మా ప్రభుత్వ పని తీరు నచ్చి ప్రజలు మమ్మల్ని గెలిపించారు. మున్సిపల్ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించిన ప్రజలకు ధన్య వాదాలు అంటూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఫలితాల సందర్భంగా సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి గంగుల మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి మమ్మల్ని ఓడించాలని చూసాయని, కాంగ్రెస్ తో చేతులు కలపడం వల్లే బీజేపీ 13 డివిజన్లలో గెలిచిందని విమర్శించారు. చరిత్రలో మొదటిసారి కాంగ్రెస్ సున్నాకే పరిమితమైందని చెప్పారు. గెలిచిన ఇండిపెండెంట్లలో మా వాళ్ళే 6 గురు ఉన్నారని తెలిపారు. ప్రజలకోసం రేపటి నుంచే పని చేస్తామని, 2023 లక్ష్యంతో పని చేస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్ లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం ఇప్పుడు తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఎవరి సపోర్టు లేకుండా మేయర్ స్థానాన్ని గెలిచామని అన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి కొన్ని ఓట్లు బీజేపీ తీసుకుందని చెప్పారు. ఎన్నికలేవి మరో నాలుగేళ్ళ దాకా లేవని, రాజకీయాలు ఇక మాట్లాడనని, ఇక అభివృద్ధిపైనే దృష్టి పెడతామని తెలిపారు.
మా బాస్ కేసీఆర్ సీల్డ్ కవర్ లో ఎవరి పేరు పంపిస్తే వారే మేయర్ అవుతారని స్పష్టం చేశారు. ఇండిపెండెంట్లు టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని, మేయర్, డిప్యూటీ మేయర్ మా పార్టీవాళ్లే అవుతారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.