JMS News Today

For Complete News

కార్మికులారా…గమనించండి…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, అక్టోబర్ 13: ఆర్టీసీ కార్మికులు వారి డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తుంటే, కొందరు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు కార్మికులను వాడుకుంటున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. సమ్మెను రాజకీయంగా వాడుకోవడం సరికాదని, దీనిని ఆర్టీసీ కార్మికులు గమనించాలని కోరారు. ఆదివారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు తమ నాయకత్వం గురించి ఆలోచించాలని సూచించారు. రాజకీయ లబ్ది కోసమే కార్మికులను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. మొదట కార్మికులు అడిగిన 26 డిమాండ్లను మర్చిపోయి కేవలం విలీనం మాత్రమే అడుగుతున్నారని, విలీనం అనేది టీఆర్ఎస్ మానిఫెస్టోలో లేదని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా ? దీనిని కార్మికులు ప్రశ్నించాలని సూచించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని మేమేపుడూ చెప్పలేదని తెలిపారు. ఏర్ ఇండియాను, రైల్వేను, బిఎస్ఎన్ఎల్ ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంది, దీనిని విపక్షాలు ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. కార్మికులను, ఆర్టీసీని కాపాడేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తుంటే, ఇతర పార్టీల నాయకులు వారి స్వలాభం కోసం అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష పార్టీల నాయకులు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. 44 శాతం ఫిట్ మెంట్, 16 శాతం ఐఆర్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని, కార్మికులు పునరాలోచించి కుత్సిత బుద్ధితో ఉన్న నాయకుల మాటలు గమనించాలని కోరారు.  కేవలం ముఖ్యమంత్రిపై ఉన్న అక్కసుతో విపక్షాల పార్టీలు సమ్మెను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఆర్టీసీ సమ్మెలో ఉడుముల లాగా దూరిన నాయకులను కార్మికులు గుర్తించాలని, ఎక్కడ టెంట్ కనిపించినా దూరిపోయి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విపక్షాల పద్ధతిగా మారిపోయిందని దుయ్యబట్టారు. గతంలో కంటే రవాణా వ్యవస్థ మెరుగైందని, ప్రజలు సంతోషంగా ఉండడం విపక్షాలకు మింగుడు పడడం లేదని, అందుకే ఏ ఆధారం లేక ఆర్టీసీ కార్మికులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సాధ్యం గాని డిమాండ్ ను ముందుకు పెట్టి అనవసరపు ప్రయత్నాలు చేస్తున్నారని, ముఖ్యమంత్రికి కార్మికులపై ఎలాంటి కోపం లేదని, కార్మికులను బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అనవసరంగా పక్కదారి పట్టిస్తున్నారని, ఈ విషయాన్ని కార్మికులు గమనించాలని మంత్రి కమలాకర్ మరోమారు కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకెె రవిశంకర్, సుడా చైర్మన్ రామకృష్ణారావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *