మంత్రి గంగుల ఏమన్నారంటే…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 10: కేసీఆర్ ఒక నమ్మకం, ఒక బలం..కేసీఆర్ బొమ్మతోనే ఎన్నికల్లో గెలిచామంటూ కరీంనగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పునరుద్ఘాటించారు. కేసీఆరే మా లీడర్.. ఆయన నాయకత్వంలోనే అందరం కలిసికట్టుగా ప్రజల ఆకాంక్షలకనుగుణంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ కు కరీంనగర్ సెంటిమెంట్ జిల్లా అని, ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా మంగళవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తెలంగాణ విషయంలో చంద్రబాబు అవలంబించిన వైఖరి నచ్చక టీడీపీ నుంచి బయటకు వచ్చి మొదటి గొంతుగా ముందుకు వచ్చానని తెలిపారు. ఉద్యమంలో లోకల్ ఎమ్మెల్యేగా కీలక పాత్ర పోషించినట్లు వివరించారు. 2013లో టీఆర్ఎస్ లో చేరానని, 2013 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు సీఎం కేసీఆర్ డైరెక్షన్ లో పార్టీలో క్రియాశీలక వ్యక్తిగా పనిచేశానని చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన మాట తప్పలేదని, 2014 లో తనకు టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. మళ్ళీ 2018 లో కూడా టికెట్ ఇచ్చారని, నాది రాజకీయ కుటుంబం కాదని, కౌన్సిలర్ నుంచి నా రాజకీయ ప్రస్థానం మొదలై అంచలంచెలుగా ఎదిగానని వివరించారు. కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యేగా తాను ఎప్పుడు ఓటమి ని ఏరుగలేదని, కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు నన్ను అక్కున చేర్చుకుని ఆశీర్విదించారని, వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. అభివృద్ధి పరంగా నా ప్రజల రుణం తీర్చుకుంటానని మరోమారు స్పష్టం చేశారు. అభివృద్ధిలో కరీంనగర్ ను ఒక ఐకాన్ గా నిలబెడతానని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సుడా చైర్మన్ రామకృష్ణారావు, గ్రంధాలయ చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.