JMS News Today

For Complete News

మంత్రి గంగులకు బీసీ సంఘాల సన్మానం

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, సెప్టెంబర్ 30: బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో సోమవారం మంత్రి గంగులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగరానికి చెందిని పలు బీసీ కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు హాజరైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. సభా ప్రాంగణానికి మంత్రి గంగుల రాగానే చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో చాత్తాద వేద పండితులు వేదమంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రధాన ద్వారం వద్దనుండే మేళతాళాలతో లోనికి తీసుకువచ్చారు. అనంతరం చాత్తాద బంధువులు ఆశీర్వచనాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడుతూ  బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై నిరంతరం కృషి చేస్తానని వారి అభివృద్ధికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. కరీంనగర్ పై ముఖ్యమంత్రికి అపారమైన నమ్మకం ఉందని మంత్రి అన్నారు. ఇక్కడి నుంచి ఏ ఉద్యమం ప్రారభించినా విజయవంతమేనని, ఆ ప్రేమతోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నాలుగు మంత్రి పదవులు ఇచ్చారని చెప్పారు. తనకు వచ్చిన మంత్రి పదవి తనది కాదని, బడుగు బలహీన వర్గాల ప్రజలందరిదీ అని స్పష్టం చేశారు. వెనుకబడ్డ కులాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకు రమ్మని సీఎం ఆదేశించారని, బీసీ సంక్షేమమే కాకుండా నిరుపేదలకు అన్నం పెట్టే పౌరసరఫరాల శాఖ నిర్వహించే బాధ్యత ఇచ్చారని చెప్పారు. వెనకబడ్డ కులాల బిడ్డగా పుట్టడం తన అదృష్టమని, తాను తప్పు చేయనని, తప్పుచేసే పరిస్థితే వస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. నమ్ముకున్న వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని, ఎవ్వరికీ మచ్చ తీసుకురాకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు. గంగుల కమలాకర్ ఒక వ్యక్తి కాదని వెనుకబడ్డ కులాల శక్తి తనకు అండగా ఉందని అన్నారు. ప్రజల కోసం చేసిన అభివృద్ధి పనులే వరుసగా మూడు సార్లు గెలిపించాయని, ప్రజల అభివృద్ధికే సర్వదా కట్టుబడి ఉంటానని చెప్పారు. గత 70 ఏండ్ల పరిపాలనలో గత పాలకులు చేసిందేమీ లేదని, వెనుకబడ్డ కులాల ఆర్థిక సామాజిక ఎదుగుదలకు ఏనాడూ సహకారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత… ఏకంగా 98 వేల మంది బీసీ బిడ్డలకు ప్రభుత్వ సహకారంతో చదువుకునే అవకాశం కల్పించాలని చెప్పారు. అంతేకాకుండా బలహీన వర్గాల ఇళ్లలో ఆడబిడ్డల వివాహానికి మేనమామలా సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారని ఆర్థిక మాంద్యం వెంటాడినా కళ్యాణలక్ష్మి ఆగలేదని తెలిపారు. వెనుకబడ్డ కులాల బిడ్డలను అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని, ఈ విషయంలో ఎన్ని నిధులనైనా వినియోగించేందుకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని ప్రకటించారు. తాను ప్రజలందరికీ సంబంధించిన వ్యక్తినని, ఎవరికీ కళంకం తెచ్చే పని చేయనని చెప్పారు. కరీంనగర్ బిడ్డలకు ఉపాధి కల్పించేందుకు ఐటీ టవర్ నిర్మిస్తున్నామని, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేబుల్ బ్రిడ్జి పనులు ప్రారంభం అయ్యాయని, భవిష్యత్తులో మానేరు రివర్ ఫ్రంట్ కూడా నిర్మిస్తామని స్పష్టం చేశారు. విద్య, ఉద్యోగం, ఉపాధి, పర్యాటకం, సురక్ష, పారిశుధ్యం లాంటి అంశాల్లో ముందుండాలని… అప్పుడే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని తెలిపారు. బీసీల అభివృద్ధికి త్వరలోనే ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేసి, అన్ని విషయాలు సమగ్రంగా చర్చిస్తామని ప్రకటించారు. తాను ఎప్పటికీ అందరి వాడినని, మనిషి మారను మాట మారదని అన్నారు. బీసీ కులాల ఐక్య వేదిక కన్వీనర్ మెతుకు సత్యం ఆధ్వర్యంలో… ఈ కార్యక్రమం జరిగింది. పలు బీసీ కుల సంఘాల ప్రతినిధులు, వారి సభ్యులు… మంత్రికి ఘన స్వాగతం పలికారు. సభా వేదికపై ఆయా సంఘాల అధ్యక్షులు, ఇతర ప్రతినిధులు ఆసీనులయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, వివిధ కుల సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *