“హుజూర్” గెలుపు వారికి చెంపపెట్టు…
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రామడుగు, నవంబర్ 4: నామినేటేడ్ పదవుల్లో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆది నుంచి పార్టీని నమ్ముకుని ఉద్యమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటదని పేర్కొన్నారు. సోమవారం రామడుగు మండలం గోపాల్ రావు పేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ప్రజల మదిలో చిరకాలం ఉంటుందని చెప్పారు. ప్రతిపక్షాలకు హుజుర్ నగర్ గెలుపు చెంపపెట్టు అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల పార్టీ, పేద ప్రజల ఆమోదం పొందిన పార్టీ అని తెలిపారు. తనకు బడుగు బలహీన వర్గాలకు సేవ చేసుకొనే అవకాశం కల్పించిన కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. గతంలో రైతులు విత్తనాలు వేసి ఆకాశం వైపు చూస్తుండే వారని, కానీ నేడు ఆ పరిస్థితి లేదని, కాళేశ్వరం నీళ్లతో ఏడాదికి మూడు పంటలు పండుతున్నాయని వివరించారు. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని, భారతదేశంలో రూ.1835 మద్దత్తు ధర ఎక్కడ లేదని, తెలంగాణ రైతులు పండించిన ప్రతిగింజను కొంటామని సీఎం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని అడ్డుకోవాలని సూచించారు. ఐకేపీ సెంటర్లలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.
మార్కెట్ కు దశల వారిగా రైతులను తరలించాలని సూచించారు. రబీలో మరింత ధాన్యం దిగుబడి ఉంటుందని, ధాన్యం కొనుగోలు ఛాలెంజ్ గా తీసుకోవాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోకుండా అభివృద్ధిపై దృష్టి పెడుతున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, గ్రంధాలయ చైర్మన్ రవీందర్ రెడ్డి లతోపాటు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.