JMS News Today

For Complete News

దేశభక్తి పెంపోందేలా…!

1 min read

జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 4: దేశభక్తి పెంపొందే విధంగా భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం భారత స్వాతంత్ర వజ్రోత్సవాల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో వజ్రోత్సవాల కమిటీ నిర్వహించిన జిల్లా స్థాయి అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రజల్లో అడుగడుగునా దేశభక్తి భావన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేలుకొలిపేలా సమున్నతంగా, అంగరంగ వైభవంగా వీటిని నిర్వహించాలని సూచించారు. పాఠశాల విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 3,08,427 గృహాలపై జాతీయ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహాన్ని ఘనంగా నిర్వహించనున్నదని మంత్రి వెల్లడించారు. జిల్లాలో ఈ నెల 8 నుంచి 20వరకు నిర్వహించే కార్యక్రమాల విజయవంతంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయ్యేవిధంగా అధికారులు చొరువ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమ విజయవంతానికి అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా 9వ తేదీ నుంచే జిల్లా వ్యాప్తంగా జాతీయ పతాకాల పంపిణీని చేపట్టాలని సూచించారు. ఈ పంపిణీ కార్యక్రమం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జరగాలని పేర్కొన్నారు.వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ సమారోహం ఆగస్టు 8న ప్రారంభమవుతుందని, ఉదయం 7.00 గంటలకు అంబేద్కర్ స్టేడియం నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా ఆర్మీ, పోలీస్‌ బ్యాండ్‌తో రాష్ట్రీయ శాల్యూట్‌ జాతీయ గీతాలాపన, స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనను నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలో భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 3,08,427 గృహాలకు జాతీయ జెండా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై.సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పర్సన్ ఏనుగు రవీందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యామ్ ప్రసాద్ లాల్, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, నగర పాలక సంస్థ కమీషనర్ సేవా ఇస్లావత్, జమ్మికుంట, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్లు రాజేశ్వరరావు, రుద్రరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, డిఆర్డిఓ శ్రీలత, ఎడి హ్యాండ్లూమ్స్, జిల్లా అధికారులు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.