రైతులు…ఆ దిశగా ఆలోచించండి…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, మే 12: రైతులు పంట మార్పిడి విధానాలను పాటించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రైతులు తమకు అవసరమైన ఆహార పంటలు మనమే పండించుకునేలా సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించాలని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో వానాకాలం పంటలు, సమగ్ర వ్యవసాయ విధాన ప్రణాళికపై మంత్రి గంగుల కమలాకర్ వ్యవసాయ అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పత్తి, మొక్కజొన్న లాంటి పంటల సాగుకే పరిమితం కాకుండా రైతులకు కొత్త పంట సాగు విధానాలు, లాభాలు వివరించి వారిని ఆ వైపు అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. మొన్నటి సమీక్షలో మన పంటలు మనమే పండించుకోవాలని సీఎం సూచిస్తే కొంత మంది రైతు బంధు రద్దు చేస్తున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. రైతులు తమ వ్యవసాయ భూముల్లో భూసార పరీక్షలు పూర్తి చేసి భూసారం ఆధారంగా ఎరువులు, రసాయనాలు వాడేలాని తెలిపారు.
మనం ఇష్టమొచ్చినట్లు ఎరువులు వాడితే నేల విషపూరితమై సారం కోల్పోయే ప్రమాదముందని అన్నారు. పోటాష్, యూరియా, డీఎపీ చాలా చోట్ల అవసరం లేకున్నా వాడుతున్నారని . చాలా నేలల్లో లవణాలు ఉన్నా మళ్లీ అదనంగా ఎరువు రూపంలో వేస్తే భూసారం తగ్గుతుందని వెల్లడించారు. వేసవి కాలంలో గతంలో కంటే మూడు రెట్ల పంట పండిందని, అయినప్పటికీ అందరి దగ్గర వరి పంట కొంటున్నామని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఏనాడు 25 లక్షల మెట్రిక్ టన్నులకు మించి ధాన్యం కొనలేదని, ఈసారి 70 లక్షల మెట్రిక్ టన్నులు కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఇప్పటికే 40 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని తెలిపారు. విత్తనాల నుంచి పంటకు గిట్టుబాటు ధర వరకు రైతులకు ఏ ఇబ్బంది రాకూడదన్నదే తెలంగాణ సర్కారు ధ్యేయమని తెలిపారు. దొడ్డు రకం వడ్ల స్థానంలో సన్నరకాలు పండించాలని అన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు.
ఏప్రిల్, మే నెలల్లో వరి కోతల సమయంలోనే వడగళ్ల వానలు పడుతున్నాయని, ఈ సమస్య రాకుండా పంటకాలం ముందుకు తెచ్చుకోవాల్సిన అవసం ఉందని అన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సతీష్ కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్ రావు, జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై.సునిల్ రావు, కలెక్టర్ కె శశాంక, జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.