JMS News Today

For Complete News

బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఫిబ్రవరి 9: రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ, నిజామాబాద్ ఎంపీ అరవింద్ లకు బీసీల పట్ల చిత్తశుద్ది ఉంటే మాతో కలిసి రావాలని, బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రిని అడుగుదామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు చట్టసభలో రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. మంగళవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఎంబీసీలు అంటే మీకు తెలుసా 17మంది కులాల వారిని బీసీల్లో చేర్చిన ఘనత ముఖ్య మంత్రి కేసీఆర్ దేనని గుర్తు చేశారు. బీసీ స్కాలర్షిప్స్ కోసం మీరు రూ. 500కోట్లు ఇస్తే రూ. 9000 కోట్లు కేటాయించిన ఘనత తెరాస ప్రభుత్వానిదని అన్నారు. తెరాస ప్రభుత్వం రాక ముందు బీసీలను బానిసలుగా భావించారని, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలు ఆత్మ గౌరవంతో జీవిస్తున్నారని తెలిపారు. కోట్ల రూపాయలు విలువ చేసే కోకాపేటలో ఆత్మగౌరవం భవన నిర్మాణం ప్రారంభమైందని, మిగతా ఆన్ని చోట్ల మార్చి నెలలో ఆత్మగౌరవ భవనాల నిర్మాణం ప్రారంభమవుతాయని చెప్పారు. బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. దేశానికి మహాత్ముడు ఎలాగో తెలంగాణ మహాత్ముడు కేసీఆర్ అని, ఆయన ఉన్నన్ని రోజులు ఏ పార్టీకి పుట్టగతులు ఉండవని తెలిపారు. పార్టీలో ధిక్కార స్వరం అనేది లేదని, కేసీఆర్ చెప్పే మాట మాకు వేదవాక్కు అంటూ పేర్కొన్నారు. కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులు కేవలం ఈ నాలుగు నెలలకే వసూలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి మార్పు లేదని కేసీఆరే స్వయంగా ప్రకటించారని, దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని మంత్రి కమలాకర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మేయర్ సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.