JMS News Today

For Complete News

ఆయన ముందుచూపుతోనే….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 12: ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగిందని, కాళేశ్వరం జలాలతో బీడు భూములన్ని సాగులోకి వస్తున్నాయని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కాళేశ్వరం జలాలతో రైతులకు వానాకాలం సాగు కోసం భరోసా కల్పిస్తున్నామని అన్నారు. సోమవారం ఎల్ఎండి జలాశయం నుండి అధికారులతో కలసి మంత్రి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు లోయర్ మానేరు జలాశయం నుండి కాకతీయ కాలువ ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. సాగుకు సమృద్ధిగా నీరు అందించాలనే ఉద్దేశంతో కాళేశ్వరం జలాలు ఎస్సారార్ ప్రాజెక్టులో ఎత్తి పోసినట్టు వివరించారు. రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని 10 రోజుల పాటు 3 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తామని తెలిపారు. రైతుల డిమాండ్ ను బట్టి అవసరమైతే నీటి విడుదల సామర్థ్యం 3 వేల 5 వేలకు పెంచుతామని చెప్పారు. కాకతీయ కాలువ ఆయకట్టుకింద సుమారు 9లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని వెల్లడించారు. జులై మాసంలో ఎల్ఎండిలో ప్రస్తుతం 21 టిఎంసీల నీటితో జలకళ సంతరించుకుందని, గత చరిత్ర చూస్తే మానేరు జలాశయంలో జూన్ , జులై మాసంలో 5 టిఎంసిల నీటి నిల్వలు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు. మానీరు మాకు కావాలంటూ నీటి యుద్దాలు జరిగేవని, చివరికి నేను సైతం ఇక్కడి నీటిని ఇక్కడే వాడాలని ఇసుక సంచులు వేసి ఆందోళన చేసినట్టు గుర్తు చేశారు. కాళేశ్వరం జల రాకతో పరిస్థితులు మారి పోయాయని, నా చేతులతో నీటిని ఇతర ప్రాంతాలకు విడుదల చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. నీళ్లు లేక వర్షాలు రాక రైతులు ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వానకాలం సాగు చేసే వారని, కేసీఆర్ పై నమ్మకంతో రైతులు ముందస్తు నాట్లకు సిద్ధమవుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఎల్ఎండి జలాశయం నుండి విడుదల చేసిన నీరు కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్ నుండి సూర్యాపేట వరకు 7 జిల్లాలలోని 33 మండలాల్లోని భూములకు సాగునీరు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, నీటిపారుదల శాఖ ఈఎన్సీ శంకర్, ఎస్ఈ శివ కుమార్, ఈఈ నాగభూషణం, డిప్యూటీ ఈఈ సమ్మయ్య, ఏఈలు కాళిదాసు, వంశీ, అంజు ఉన్నీసా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *