ఆమె తెగువ మహిళా చైతన్యానికి ప్రతీక…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 26: సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ తెలంగాణ తెగువకు నిదర్శనమని, మహిళా చైతన్యానికి ప్రతీక అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నట్లు పేర్కొన్నారు. మాటల్ని తూటాలుగా మలిచి..దోపిడీదారుల గుండెల్లో ఫిరంగిగా పేలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ జీవితం భవిష్యత్ తరాలకు స్పూర్తిదాయకమైందని చెప్పారు. చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా కరీంనగర్ లోని ఆమె విగ్రహానికి మంత్రి గంగుల పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఐలమ్మ జయంతి, వర్థంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆమె చేసిన పోరాటానికి నిజమైన నివాళి అని చెప్పారు. తెలంగాణ మట్టిలోనే పోరాటం ఉందని, అందుకు ఐలమ్మ జీవితం గొప్ప సందేశమన్నారు. తెలంగాణ ఉద్యమ కారులను, పోరాట యోధులను సీఎం కేసీఆర్ ప్రభుత్వం గొప్పగా గౌరవించుకుంటున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, మేయర్ సునీల్ రావు, డిప్యూటి మేయర్ చల్లా స్వరూపరాణితోపాటు పలువురు పాల్గొన్నారు.