అందరూ కదలిరండి…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 23: ‘నేను సైతం..నా నగరం కోసం’…అనే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నగర ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నేను సైతం నా నగరం కోసం రూపొందించిన పోస్టర్ ను మంత్రి కమలాకర్ ఆవిష్కరించి, ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకనుగుణంగా రూపొందించిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం మాదిరిగానే నేను సైతం నా నగరం కోసం అనే కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రతిరోజు గ్రామాలు తిరుగుతూ చెత్తను తొలగిస్తున్నారని, కలెక్టర్ ను స్ఫూర్తిగా తీసుకొని గ్రామస్తులంతా శ్రమదానం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కలెక్టర్, పోలీసు కమిషనర్, మున్సిపల్ కమిషనర్లు కరీంనగర్ లో చెత్తను తొలగిస్తున్నారని, కరీంనగర్ లో పుట్టి పెరిగిన మనం నగరాన్ని సుందరంగా తయారు చేయడానికి ఎందుకు చెత్త తీయకూడదని ప్రశ్నించారు. కరీంనగర్ ఆరోగ్యంగా, సుందరంగా మారితే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కరీంనగర్ లో నిర్మిస్తున్న తీగల వంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని చెప్పారు. ఐటి టవర్స్ నిర్మాణం పూర్తి కావస్తుందని తెలిపారు. మానేర్ రివర్ ఫ్రంట్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని అన్నారు. ఇంట్లో చెత్తని ఊడ్చి మురికికాలువలో వేయవద్దని కోరారు. ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నేను సైతం నా నగరం కోసం అనే కార్యక్రమానికి ఎమ్మెల్యేగా తనవంతుగా రెండు లక్షల రూపాయల విరాళ చెక్కును మున్సిపల్ కమీషనర్ కు అందజేశారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ల అసోసియేషన్ రెండు లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, సుడా చైర్మన్ జి.వి రామకృష్ణారావు, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.