JMS News Today

For Complete News

అందుకే ఆ చట్టం…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, అక్టోబర్ 1: వ్యవసాయేతర ఆస్తులపై ఎన్నో ఏండ్లుగా నానుతున్న సమస్యలను పరిష్కరించి పేద, మధ్య తరగతి వర్గాలకు ఆస్తి హక్కులు కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండల సర్పంచులు, ఎంపిటిసి లు, గ్రామ పంచాయితీ సెక్రటరీలతో కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చాలాచోట్ల పేద ప్రజల ఆస్తుల హక్కులపై సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చిందని తెలిపారు. ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా కృషిచేస్తున్నట్టు చెప్పారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆస్తి హక్కు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ప్రజల నుంచి అదనంగా డబ్బు వసూలు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని, కేవలం ప్రజలకు వారి ఆస్తులపై హక్కులు కల్పించాలన్న ప్రయత్నమే చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆస్తుల క్రయవిక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. ఇక రానున్న 15 రోజులపాటు ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా చురుగ్గా పాల్గొని ప్రభుత్వ అధికారులకు సహకరించాలని మంత్రి కోరారు. ప్రజలు దళారులను నమ్మవద్దని, ఎవ్వరికీ ఒక్కపైసా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆస్తుల నమోదు ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో దాదాపుగా భూ సమస్యలు తొలగిపోయాయని, ప్రస్తుతం వ్యవసాయేతర ఆస్తుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మంత్రి గంగుల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ఆనంద్ కుమార్, డిపిఓ వీర బుచ్చయ్య, ఎంపీడీవోలు శ్రీనివాస్ రెడ్డి, పవన్ కుమార్, ఎంపీపీలు తిప్పర్తి లక్ష్మయ్య, పిల్లి శ్రీలత, జడ్పీటీసీలు పురమల్ల లలిత, పిట్టల కరుణ, ఆర్ టి ఏ మెంబర్ తోట శ్రీపతిరావు , సుంకిశాల సంపత్ రావు ఎమ్మార్వో లు సిహెచ్ శ్రీనివాస్, వెంకట్ రెడ్డి , నాయకులు మంద రాజమల్లు సాబీర్ పాష ,కాశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *