కొబ్బరికాయ కొట్టిన కొప్పుల….
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్ ,జూన్ 29: ఇచ్చిన హామీ ప్రకారం గిరిజన భవన్ నిర్మించడం జరుగుతోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్‌లోని ఉజ్వల పార్కు వద్ద గిరిజన భవనానికి ఆయన ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ గిరిజనుల కోసం ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లో గిరిజనుల కోసం ఎకరం భూమిని కేటాయించామని పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని, ఇందులో భాగంగానే కరీంనగర్ లో గిరిజన భవన నిర్మాణానికి రూ.1.10 కోట్లు మంజూరు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాలకు, మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ వారి అభివృద్ధికి పాట్లు పడుతున్నారని తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఉజ్వల పార్క్ సమీపంలో సుమారు అర ఎకరం స్థలంలో కోటి 10 లక్షల రూపాయలతో గిరిజన భవన నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని, దీనితో గిరిజన నాయకుల చిరకాల కోరిక తీరబోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మేయర్ రవీందర్ సింగ్, డిప్యూటీ మేయర్ రమేష్, జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లతోపాటు పలువురు పాల్గొన్నారు.