వారు రాజ్యాంగబద్దంగానే చేరారు….!
1 min read
వారు రాజ్యాంగబద్దంగా చేరారు….
* కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
ఢిల్లీ, జూన్ 23: రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయడంపై ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి ఖండిస్తూ… టీడీపీ విమర్శలను కొట్టిపారేశారు. ఢిల్లీలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ పార్టీకి వారు రాజీనామా చేసి, రాజ్యసభలో వారి పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన తీర్మాన ప్రతులను తమకు అందించాకే వారిని బీజేపీలో చేర్చుకున్నామని, టీడీపీ నేతల చేరికలను అమిత్ షా కూడా అంగీకరించినట్టు చెప్పారు. టీడీపీ ఎంపీలు చట్టబద్ధంగానే బీజేపీలో విలీనమయ్యారని, ఈ విషయం తెలియకుండానే కొందరు విమర్శిస్తున్నారని, రాజ్యసభలో గతంలో ఇలాంటి విలీనాలు 16 సార్లు జరిగాయని అన్నారు. టీడీపీ ఎంపీలపై అనర్హత వేటు వేసే అవకాశమే లేదని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారమే విలీనం జరిగిందని, అన్ని నిబంధనలు చూసిన తర్వాతే రాజ్యసభ చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. నిబంధనలను అనుసరించి వేరే పార్టీలో చేరతామంటే ఆపే అధికారం ఎవరికీ లేదని చెప్పారు. రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయడం రాజ్యాంగం ప్రకారం జరిగిందని, దీన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. గతంలో వైసీపీ నేతలను టీడీపీలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను రాజ్యాంగ విరుద్ధంగా టీడీపీలో చేర్చుకున్నారని విమర్శించారు. వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకుని వారికి మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని ఎద్దేవా చేశారు. ఇలాంటి పార్టీకి చెందిన నేతలకు ఇతర పార్టీలను విమర్శించే నైతిక హక్కు లేదని కిషన్ రెడ్డి అన్నారు.