ఆ బిల్లుతో అన్నదాతకు ఇబ్బందులు…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 20: విద్యుత్ సంస్థలపై అజమాయిషీ తీసుకోని ప్రైవేటు సంస్థలకు దారాధత్తం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని రాష్ట్ర పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. విద్యుత్ విషయంలో ఆంక్షలు పెడితే రైతులకిచ్చే ఉచిత కరెంట్ కు ఇబ్బందులు వస్తాయని స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్ పర్యటనకు వచ్చిన మంత్రి తలసాని జిల్లా మంత్రి కమలాకర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. విద్యుత్ విషయంలో మోడీ తుగ్లక్ చర్యల వల్ల రాబోయే రోజుల్లో కేంద్రానికి, రాష్ట్రాలతో ఘర్షణ వాతవరణం ఏర్పడే ప్రమాదముందని అన్నారు. కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఇతర పార్టీల ఎంపీలతో కలిసి పార్లమెంట్ ను స్థంబింపజేయాలని, ఇప్పటికే సీఎం కేసీఅర్ తమ ఎంపీలకు సూచించారని తెలిపారు. కరోనా విషయంలో కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల నిధులకు అతిగతి లేదని ఎద్దేవా చేశారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ హైదరాబాద్లో కూర్చుని పిచ్చిపిచ్చిగా మాట్లాడటం తప్ప ఏడాదిన్నర కాలంలో తన నియోజకవర్గానికి ఎలాంటి నిధులు తేలేదని ద్వజమెత్తారు. దమ్ముంటే ప్రధాన మంత్రి మోడీ దగ్గర కూర్చుని డబ్బులు తెచ్చి చూపించాలని సవాల్ చేశారు. దేశంలో ఎక్కడైనా మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం లాంటి పథకాలున్నాయా సోకాల్డ్ కాంగ్రెస్, బీజేపీ నేతలు చూపించాలని సవాల్ విసిరారు. లక్ష డబుల్ బెడ్రూంల వివరాలు త్వరలో మీడియా ముందు వెల్లడిస్తామని తెలిపారు. స్వయంగా తామే కాంగ్రెస్ నేతలను డబుల్ బెడ్రూం ఇండ్ల దగ్గరకు తీసుకెళ్తే లేని పోని ఆరోపణలు చేస్తున్నారని, అందుకే లిస్టు వారికే పంపించి మీరే వెళ్లి చూసుకోమ్మని చెప్పామని అన్నారు. కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా అల్లకల్లోలం సృష్టించినా..తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతూ ఉండటంతో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయని, ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపల పంపిణీ ఘనంగా కొనసాగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైతులు ఎన్నడూ లేని సంతోషంగా ఉందన్నారని తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వస్తుందని ఎవరు కలలో కూడా ఊహించలేదని అన్నారు. కరోనా సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసిందని చెప్పారు. రెవెన్యూ శాఖలో అవినీతి అంతం చేసేందుకు విఆర్వో వ్యవస్థను రద్దు చేశామని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కులవృత్తులకు అనేక సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చామని స్పష్టం చేశారు. గతంలో పని చేసిన ప్రభుత్వాలు చెప్పిన హామీలు కేవలం పత్రిక ప్రకటనలకే పరిమితం అయ్యాయని పేర్కొన్నారు. గాలి మాటలు చెప్పే ప్రభుత్వం మాది కాదని అన్నారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, రైతు వేదికలు, హరితహారం కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని మంత్రి తలసాని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ కనమల్ల విజయ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, మేయర్ సునీల్ రావులు , నాయకులు చల్ల హరిశంకర్, గుగ్గిల్లపు రమేష్ , సుంకిశాల సంపత్ రావు లు పాల్గోన్నారు.