ఆత్మ గౌరవ భవన స్థలాల జాబితా సిద్ధం చేయండి
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, నవంబర్ 29: బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన భూముల స్థలాలను గుర్తించి జాబితాను సిద్ధం చేయాలని మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ లు ఆదేశించారు. శనివారం మాసబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య భవనంలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అనితారాజేంద్రన్, ఇతర ఆధికారులతో మంత్రులు సమీక్షించారు. 40 బీసీ కులాల సంక్షేమానికి పలు ప్రాంతాల్లో 80 ఎకరాల భూములను ప్రభుత్వం కేటాయించిందని మంత్రులు చెప్పారు. స్థలాల గుర్తింపు, నిధుల సమీకరణపై చర్చించారు. కొన్ని దశాబ్దాల కాలంలో సమైక్యాంద్ర ప్రభుత్వంలో వెనుకబడిన తరగతుల సంక్షేమం విషయంలో సవతి ప్రేమ చూపెట్టింది అనేది వాస్తవమని, మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెనుకబడిన తరగతుల కులాలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, అందులో భాగంగా రాష్ట్ర రాజధానిలో వెనుకబడిన తరగతుల కులాలకు నగరానికి కూతవేటు దూరంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల చెందిన సుమారు 80 ఎకరాల భూమిని కేటాయిస్తూ 40 కులాల ఆత్మగౌరవ భవనములు నిర్మించుటకు 80 కోట్ల నిధులు మంజూరు చేశారని వివరించారు. ఈ భవన నిర్మాణాలు త్వరితగతిన చేపట్టుటకు సంబంధిత రెవెన్యూ హద్దులు ఏర్పాటు చేసి, భూకేటాయింపు చేసి వారి వారి కుల సంఘ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రెడ్డి సంఘం నిర్మాణం, వైశ్య సంఘ నిర్మాణం చేపట్టి విషయంలో ఆ సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాల మాదిరిగానే ఈ వెనుకబడిన తరగతుల కులాల తో కూడా అటువంటి ఒప్పందాలు కుదుర్చు కొనుటకు కోరినట్లు తెలిపారు. అనంతరం సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో అంచనాలు సిద్ధం చేయాలని సూచిస్తూ, మూడు నాలుగు రోజులలో ఆయా సంఘ ప్రతినిధులతో స్థలాలను పరిశీలించేందుకు వెళ్ళాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బలహీన వర్గాల విషయంలో ముఖ్యమంత్రి దార్శనికతను, ముందు చూపుపై కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో వెనుకబడిన తరగతుల ముఖ్య కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ అనితారామచంద్రన్, అదనపు కార్యదర్శి సైదా, మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ హరీష్, కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ కుమార్ తదితరులు హాజరయ్యారు.