అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 2: పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వగా, కోర్టు మాత్రం కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదైంది. గత నెల 23వ తేదీన కరీంనగర్లో జరిగిన పార్టీ సమావేశంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు అక్బరుద్దీన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా అక్బరుద్దీన్ వ్యాఖ్యల్లో ఎలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు లేవని సీపీ కమలాసన్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో కరీంగనర్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలంటూ కోర్టును కోరారు. దీనిపై విచారించిన ధర్మాసనం..అక్బరుద్దీన్ ఒవైసీపై ఐపీసీ సెక్షన్ 153-ఏ, 153-బి, 506, సీఆర్పీసీ 156(3) కింద కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కరీంనగర్ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేశారు.