జంక్షన్ లు ఏలా ఉండాలంటే…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 13: కరీంనగర్ లోని జంక్షన్ లను అంతర్జాతీయ ప్రమాణాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. శనివారం మీ సేవా కార్యాలయంలో నగరపాలక సంస్థ ఎస్ఈ భద్రయ్య, డిఈలు మసూద్ అలీ, యాదగిరి, రామన్, పంచాయితీ రాజ్ ఏఈ ప్రవీణ్ లతో ఎమ్మెల్యే కమలాకర్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి నగరపాలక సంస్థకు మూడు విడతల్లో సుమారు రూ.350 కోట్ల నిధులు కేటాయించారని అన్నారు. వివిధ శాఖల ద్వారా సుమారు రూ.100 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని, టెండర్ గాని పనులకు త్వరలో టెండర్లు పిలిచి త్వరితగతిన పనులన్నీ పూర్తి చేయాలని అన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని అధికారులకు సూచించారు. మున్సిపల్ కోడ్ రాకముందే నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అన్నారు. అభివృద్ధికి కెసిఆర్ ఇచ్చిన నిధులను దుర్వినియోగం కాకుండా పూర్తి స్థాయిలో విజయం చేయాలని అధికారులకు సూచించారు. నగరంలోని ఐలాండ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతంలో వర్క్ ఇన్స్పెక్టర్ లు ఫీల్డ్ మీద ఉండాలని అన్నారు. అభివృద్ధి పనులలో వేగం పెంచాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. ప్రజాధనం వృధాకాకుండా చూడాలని అన్నారు. సుందరికరణ పనులు అన్ని పూర్తి చేసి 2023 వరకు కరీంనగర్ ను భారతదేశంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ నెల 20న శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు సుడా జి వి రామకృష్ణ రావు తెలిపారు. ఈ సమావేశం తర్వాత సుడా పరిధిలోని గ్రామాల అన్నింటిలో అభివృద్ధి పై దృష్టి పెడతామని జీవి తెలిపారు. సుడా పరిధిలో ఉన్న రోడ్ల నీటిని విస్తరించి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇప్పటికే శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో 1 కోటి 50 లక్షల జమ అయ్యాయని తెలిపారు. ఈ నిధులను కరీంనగర్ అభివృద్ధికి వినియోగించుకుంటామని వెల్లడించారు.