JMS News Today

For Complete News

ఇగో కాళేశ్వరం ఇలా…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 5: ఉద్యమకారుడే పాలకుడు. అందుకే  తెలంగాణ అభ్యున్నతికి చక్కటి ఆలోచనలు చేస్తున్నారు. ఫలితంగా అన్ని వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటూ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ఒక్క చోట ప్రారంభమై రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందించే ప్రక్రియ ఇది. పలు ప్యాకేజీలుగా విడగొట్టిన కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు స్వరూపం గురించి వివరాలు చాలా మందికి తెలియవు. ముఖ్యంగా రైతులకు కాళేశ్వరం గుర్తించి స్పష్టత ఇచ్చేందుకు ఈ ప్రయత్నం. మరో పది రోజుల్లో కాళేశ్వరం నీళ్లు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చేరనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామంలోని రాజశ్రీ గార్డెన్స్ లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని పలువురు రైతులు, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఫంక్షన్ హాళ్లో భారీ వీడియో స్క్రీన్ ఏర్పాటు చేసి…కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. మ్యాప్ సాయంతో ప్రతి ఒక్క ప్యాకేజీకి సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్వయంగా వివరించారు. ఒక్కో ప్యాకేజీలో నీటి లభ్యత, మోటార్ల సంఖ్య, పంపు హౌజుల వివరాలు, గ్రావిటీ కాలువల దూరం, బ్యారేజీ కెపాసిటీ, టన్నెల్స్ వివరాలు, సర్జిపూల్స్ సామర్థ్యాలు తదితర అంశాలను తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తోపాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, జడ్పీటీసీ పురుమల్ల లలిత-శ్రీనివాస్, ఎంపీపీలు పిల్లి శ్రీలత-మహేశ్, తిప్పర్తి లక్ష్మయ్య, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు. వీడియో చూస్తూ వివరాలు తెల్సుకున్న రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమలాకర్ మాట్లాడుతూ  చరిత్ర సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మితమవుతున్న సమయంలో తాను ప్రజాప్రతినిధిగా ఉండడం తన అదృష్టమని పేర్కొన్నారు. భావి తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని…ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతటి మహత్కార్యానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. మరో రెండ్రోజుల్లో ఎల్లంపల్లి నుంచి వరదకాలువకు నీరు విడుదల అవుతుందని తెలిపారు. కాళేశ్వరం గురించి నియోజకవర్గ ప్రజలకు, టీఆర్ఎస్ నాయకులకు తెలియచేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. నాలుగైదు రోజులు శ్రమించి ఈ సదస్సుకు రూపకల్పన చేశామని చెప్పారు. ఎంతో ముందుచూపుతో ఈ ప్రాజెక్టు నిర్మించారని…విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు…తమ క్యాడర్ కు తగిన వివరాలు అందించామని అన్నారు. రైతాంగానికి భరోసా ఇచ్చే విధంగా ఈ ప్రాజెక్టు పని చేస్తుందని… దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *