కాంట్రాక్టర్ల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 2: కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల రోడ్డు పనులు నిలిచిపోయాయని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షం కారణంగా నగరంలోని పలు రోడ్లు చెడిపోయాయని, కొన్ని రోడ్లు కోర్టు తీర్పు మేరకు నిలిచిపోయాయని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యానికి ముందు నుండి ఉన్నటువంటి మట్టి రోడ్లు మాత్రమే బురదమయంగా మారయన్నారు. ఎల్ఐసీ ఆఫీస్ నుండి కట్టరాంపూర్ మీదుగా ఓల్డ్ యూనివర్సిటీ, భగత్ సింగ్ విగ్రహం పెద్దమ్మ ఆలయం మీదుగా బైపాస్ రోడ్డు, టవర్ ఏరియాలోని రోడ్డు పనులు సీఎం అష్యూరెన్స్ జాబితాలో చేర్చామని, తదనంతరం అప్పటి కమీషనర్ సూచన మేరకు సీఎం అష్యూరెన్స్ నుండి స్మార్ట్ సిటీ జాబితాలోకి మార్చామని చెప్పారు. హౌజింగ్ బోర్డు కాలనీ, కిసాన్ నగర్ టూ రైల్వే స్టేషన్ లాంటి డ్యామేజ్ రోడ్లు సైతం స్మార్ట్ సిటీ లో జాబితాలోకి తీసుకెళ్లామని చెప్పారు. మిగతా రోడ్లన్నీ హైవే రోడ్డుల్లా తయారయ్యాయని అన్నారు. మిషన్ భగీరథ పనుల వల్ల రోడ్లు కొంతమేర చెడిపోయాయని, త్వరలో బాగు చేస్తామని తెలిపారు. కొన్ని ప్రధాన రహదారుల పనులు కోర్టు అడ్డంకిగా మారాయని, కోర్టు స్టే విధించిందని, ఎన్నికల అనంతరం పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. స్థానిక నాయకుల సహకారంతో సంబంధిత కాంట్రాక్టర్లు కోర్టుకు మెట్లెక్కుతున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ లాభాపేక్షతో నగర ప్రజలను ఇబ్బందులపాలు చేయడం సరికాదన్నారు. అంతర్గత రోడ్ల విషయంలో రోడ్లన్నీ టెండర్లు పిలిచామని, ఒక్కో కాంట్రాక్టర్ తలకుమించి కాంట్రాక్టులు పొందడంతో ఆలస్యమవుతుందన్నారు. పది మంది కాంట్రాక్టర్ల ఆలసత్వంతో వేలాది మంది నగర ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నూతనంగా పనులు ఇప్పుడే ప్రారంభించవద్దని, పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని కాంట్రాకర్లను సూచించారు. రోడ్డు మీద ఉన్న మట్టి ర్యాంపులను తొలగిస్తామన్నారు. పనులు ఆపితే సహించేదిలేదని హెచ్చరించారు.
ఏకకాలంలో పనులు జరుగుతున్నందున ప్రాసెస్ లో ఆలస్యమవుతుందన్నారు. ప్రతిపక్షాలు పైశాచిక ఆనందంతో విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తూ, రోడ్లన్నీ పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.