కరీంనగర్ కు కాళేశ్వరం ప్రాణధారం
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 4: ఎస్సారెెస్పీలో ఆగష్టు నాటికి 40 టీఎంసీలు ఉండాల్సిన నీళ్లు కేవలం 7.11 టీఎంసీ మాత్రమే ఉన్నాయని కరీంనగర్ ఎమ్మెల్యేే గంగుల కమలాకర్ తెలిపారు. దీంతో ఎల్ఎండి, మిడ్ మానేరు పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్ర నుంచి దిగువకు నీరు వచ్చే పరిస్థితి లేదని, ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కరీంనగర్ జిల్లాకు ప్రాణధారం కానుందని చెప్పారు. ఈ నెల 12 నాటికి కాళేశ్వరం నీరు మిడ్ మానేరు కు రాబోతోందని, లక్ష్మీపూర్ నుంచి కాలువ ద్వారా ఎల్.ఎం.డి.కి కూడా నీరు రాబోతోందని తెలిపారు. ఇంతకాలం ఎస్సారెస్పీపై ఆధారపడే జిల్లా వాసులకు ఇక కాళేశ్వరం ప్రాణాధారమని పేర్కొన్నారు. మొదటి నీటి బొట్టు కరీంనగర్ చేరగానే భారీ ఎత్తున జల జాతర చేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనాలోచితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మిడ్ మానేరుకు నీళ్లు ఎప్పుడు వస్తాయని, కరెంటు బిల్లు ఎలా కడతారని అడుగుతున్నాడని పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ ఎంపీలు పార్లమెంటులో ఎందుకు మాట్లాడడం లేదు. ఇప్పటికైనా ప్రాజెక్టు కు జాతీయ హోదా కోసం మాట్లాడాలని హితవు పలికారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే పొన్నం, జీవన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని అన్నారు. కరీంనగర్ సీటును 40కి పైగా డివిజన్లు గెలుచుకుని మేయర్ సీటును గెలుచుకుంటామని తెలిపారు. కరీంనగర్ లోని 60 డివిజన్లలో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుందని, ఎంఐఎంకు కరీంనగర్ మేయర్ పదవి ఇస్తామని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కరీంనగర్ రోడ్ల నాణ్యత విషయంలో లోపాలుంటే అధికారులపై చర్యలు తప్పవని కమలాకర్ తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్, నాయకులు సునీల్ రావు, ఎడ్ల అశోక్, గుగ్గిలపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.