బడుగుల కోసమే మా ప్రభుత్వం…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 20: ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం దూసుకెళ్తోందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. అన్ని రకాల సంక్షేమ పెన్షన్లను డబుల్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను శనివారం ఎమ్మెల్యే లబ్దిదారులకు అందించారు. నియోజకవర్గంలోని పలు చోట్ల జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల పెంపును చేపడుతూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల మేలు కోరి సీఎం కేసీఆర్ పెన్షన్లు పెంచారని అన్నారు. రాష్ట్ర ప్రజలకు సాగునీరు అందించడంతోపాటు రహదారుల అభివృద్ధి కూడా చేపట్టారని చెప్పారు. 70 ఏళ్ల స్వాతంత్రంలో గ్రామాలను పట్టించుకున్న వారే లేరని, కాంగ్రెస్, బీజేపీలు విద్యుత్, నీరు కూడా అందించలేదని విమర్శించారు. గతంలో భూమి సాగు చేసుకున్న రైతే పన్ను కట్టాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ప్రభుత్వమే రైతుకు రైతుబంధు ఇస్తోందని చెప్పారు. రైతు భీమా ద్వారా అన్నదాత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, సుడా ఛైర్మన్ జీవీ రామక్రిష్ణా రావు, మాజీ కార్పొరేటర్లు బండారి వేణు, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కాశెట్టి శ్రీనివాస్, నందెల్లి ప్రకాశ్, హరిశంకర్, జంగిలి సాగర్, కోఆప్షన్ మెంబర్ సాబీర్ పాషా తదితరులు పాాల్గొన్నారు.